పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తే భూమి మీద జరుగుతాయని పెద్దలు చెబుతుంటారు. ఇదేంటో గానీ, కరోనా తెచ్చిన కర్మ వల్ల పెళ్లిళ్లు ఎక్కడ నిర్ణయించినా.. ఎవ్వరూ ఊహించని ప్రదేశాల్లో జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లు, చెక్‌పోస్ట్‌లు, వీడియో కాలింగ్ యాప్‌లు... ఇలా 'కాదేదీ పెళ్లి వేదికకు అనర్హం' అని చెప్పుకోవాల్సి వస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో అసోంలో ఇలాంటి వినూత్న వివాహమే జరిగింది. ఓ సరికొత్త వేదిక... పెళ్లికి ఆతిథ్యమిచ్చింది.
ఏం జరిగిందంటే?
అసోం ధుబ్రి జిల్లాకు చెందిన కాజల్ సాహా, బంగాల్ జల్పైగుడికి చెందిన ఓంప్రకాశ్ల వివాహం క్వారంటైన్ సెంటర్ సాక్షిగా జరిగింది. చాలా రోజుల క్రితమే వీరి పెళ్లి నిశ్చయించారు పెద్దలు. అందరిలాగే వీరి పెళ్లికీ లాక్డౌన్ విలన్‌గా మారింది. దీంతో చేసేదేమీ లేక, లాక్డౌన్ పూర్తయ్యే వరకు నిరీక్షించలేక పెళ్లి కానిచ్చేశారు.