తెలంగాణ

telangana

By

Published : Jun 26, 2020, 5:07 PM IST

Updated : Jun 26, 2020, 6:17 PM IST

ETV Bharat / bharat

సీబీఎస్​ఈ ఫైనల్​ మార్కులు లెక్కిస్తారిలా...

పెండింగ్​లో ఉన్న 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను సీబీఎస్​ఈ రద్దు చేసింది. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా తుది ఫలితాలను వెల్లడిస్తామని తెలిపింది. ఏ ప్రాతిపదికన బోర్డు మార్కులను నిర్ణయిస్తుంది? ఒక్క పరీక్షకు కూడా హాజరు కాని విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఇంప్రూవ్​మెంట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందా?

CBSE-ASSESSMENT-SCHEME
సీబీఎస్​ఈ పరీక్ష

కరోనా నేపథ్యంలో పెండింగ్​లో ఉన్న 10, 12 తరగతుల పరీక్షలను సీబీఎస్​ఈ రద్దు చేసింది. జులై 1 నుంచి 15వరకు ఈ పరీక్షలు నిర్వహించాలని మొదట భావించినా... వైరస్ ఉద్ధృతి కారణంగా తాజా నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలోనే విద్యార్థులు పైతరగతులకు వెళ్లేందుకు ఫలితాల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థులు వ్యక్తిగత ప్రతిభ కనబరిచిన సబ్జెక్టుల ఆధారంగా జులై 15న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. సీబీఎస్​ఈ ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.

అయితే మార్కులను ఎలా మదింపు చేస్తారనే విషయంపై చాలా మందిలో అనుమానాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి సీబీఎస్​ఈ కోర్టుకు వివరణ ఇచ్చింది.

మార్కులను ఎలా కేటాయిస్తారు?

ఇప్పటివరకు జరిగిన పరీక్షలన్నింటినీ పూర్తి చేసిన 10, 12 తరగతుల విద్యార్థులకు వారి ప్రతిభ ఆధారంగా మార్కులను నిర్ధరిస్తారు. మూడు కన్నా ఎక్కువ పరీక్షలకు హాజరైన విషయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 3 సబ్జెక్టుల మార్కులను సగటు చేస్తారు. రాయని సబ్జెక్టులకు ఈ సగటునే మార్కులుగా నిర్ధరించి పూర్తి ఫలితాలను వెల్లడిస్తారు.

మూడు పరీక్షలకు హాజరైన వారిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రెండు సబ్జెక్టుల మార్కుల సగటుతో లెక్కగడతారు.

ఈశాన్య దిల్లీ విద్యార్థుల పరిస్థితేంటి?

ఈశాన్య దిల్లీలో పౌరసత్వ వ్యతిరేక అల్లర్ల కారణంగా కొన్ని పరీక్షలు రద్దయ్యాయి. ఈ విషయంలో ఇంటర్నల్​ పరీక్షల ప్రతిభ ఆధారంగా మార్కులను నిర్ణయిస్తారు. ప్రాక్టికల్​, ప్రాజెక్టు మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

మార్కులపై అంసతృప్తి ఉంటే ఎలా?

సెప్టెంబర్‌ నాటికి పరిస్థితులు అనుకూలిస్తే అక్టోబరులో 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్​ఈ స్పష్టం చేసింది. అసెస్‌మెంట్‌ ఫలితాల కంటే ఎక్కువ మార్కులు వస్తాయనుకుంటే పరీక్షలు రాసేందుకు విద్యార్థులు సిద్ధం కావచ్చు. ఆప్షనల్‌ పరీక్షలు రాయాలా? వద్దా? అని నిర్ణయించుకునే అధికారం విద్యార్థుల ఇష్టానికే వదిలేసింది సీబీఎస్​ఈ. అయితే పరీక్షలు రాసినవారికి అందులో వచ్చిన మార్కులనే తుది ఫలితాల్లో చేరుస్తారు.

10వ తరగతి విద్యార్థులకు ఈ అవకాశం లేదు. బోర్డు జులై 15న ప్రకటించే ఫలితాలే తుది మార్కులుగా పరిగణిస్తారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే 12వ తరగతి పరీక్షలను కూడా నిలుపుదల చేస్తారు.

స్వల్ప మార్పులతో ఐసీఎస్​ఈ?

ఐసీఎస్‌ఈ ఫలితాలకు కూడా ఇదే పద్ధతిలో నోటిఫికేషన్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. అసెస్‌మెంట్‌లో సీబీఎస్‌ఈతో పోలిస్తే కొంత తేడా ఉంటుందని ఐసీఎస్‌ఈ తెలిపింది. స్వల్ప మార్పులతో వారం రోజుల్లో నోటిఫికేషన్‌ ఇస్తామని కోర్టుకు వెల్లడించింది.

నిపుణులు ఏమంటున్నారు?

మదింపు ద్వారా ఇచ్చే ఫలితాల్లో విద్యార్థులకు సరైన మార్కులు రాకపోవచ్చని సీబీఎస్​ఈ మాజీ ఛైర్మన్​ అశోక్ గంగూలీ అభిప్రాయపడ్డారు. లేదా కెరీర్​లో ఏవైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఈ విషయంలో తల్లిదండ్రులు దృష్టి సారించాలని సూచించారు.

ఈటీవీ భారత్​తో గంగూలీ

బోర్డు ప్రకటించిన ఫలితాలను అంగీకరించాలని, అవసరమైతే తప్ప ఇంప్రూవ్​మెంట్​ పరీక్షలకు హాజరవ్వాలని తెలిపారు. తొందరపడి అకాడెమిక్ సంవత్సరాన్ని వృథా చేసుకోవద్దని సలహా ఇచ్చారు.

ఇదీ చూడండి:సీబీఎస్​ఈ 10,12వ తరగతి పరీక్షల రద్దు​కు సుప్రీం ఓకే

Last Updated : Jun 26, 2020, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details