కొద్ది రోజులుగా అసోంను అతలాకుతంలో చేస్తోన్న వరదలు కాస్త తగ్గుముఖం పట్టాయి. 21 జిల్లాలపై ప్రభావం చూపగా.. వరదలకు ప్రభావితమైన వారి సంఖ్య 19.81 లక్షల నుంచి 17 లక్షలకు తగ్గటం కాస్త ఊరట కలిగిస్తోంది. అయితే.. తాజాగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 107కు చేరింది. బార్పేట, కోక్రఝర్, కమ్రుప్ జిల్లాల్లో ఒక్కక్కొరి చొప్పున మరణాలు సంభవించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం 1,536 గ్రామాలు, 92,899.95 హెక్టార్లలో పంట నీట మునిగినట్లు తెలిపింది.
భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 133కు చేరింది. వరదల్లో చిక్కుకున్న మరో 36 మందిని కాపాడారు అధికారులు.
వరదలకు తీవ్రంగా ప్రభావితమైన లఖిమ్పుర్, ధేమాజీ జిల్లాల్లో పర్యటించారు ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్. పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాల ఆదుకుంటామని ప్రజలకు భరోసా కల్పించారు.