దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు గల రాష్ట్రం ఉత్తర్ప్రదేశ్. ఆ రాష్ట్ర శాసనసభ మరో ప్రత్యేక రికార్డ్ సృష్టించే ప్రయత్నం చేస్తోంది. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రత్యేక సమావేశాన్ని నిర్విరామంగా 36 గంటల పాటు నిర్వహిస్తోంది ప్రభుత్వం. బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశం గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగనుంది.
యూపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 403. అధికార భాజపాకు 301 మంది సభ్యులున్నారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి ఎమ్మెల్యేలు ప్రసంగించడం ప్రారంభించారు. యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత సభను వీడారు. కొందరు శాసనసభ్యులు ఈ ఉదయం 4-6 గంటల మధ్య ఇంటికి వెళ్లారు.
ప్రతిపక్షం నుంచి ఒకే ఒక్కరు
ప్రభుత్వం కేవలం రికార్డు నెలకొల్పాలనే ఉద్దేశంతోనే మారథాన్ సమావేశాన్ని నిర్వహిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. ప్రతిపక్షాలకు మహాత్మా గాంధీ పట్ల గౌరవం లేదని విమర్శించారు సీఎం ఆదిత్యనాథ్.