తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వెన్నులో వణుకు పుట్టిస్తున్న దోమకాటు - dengue news updates

దేశంలోని అనేక రాష్ట్రాలు ప్రస్తుతం దోమకాటుకు విలవిల్లాడుతున్నాయి. డెంగీ వైరస్​ తాకిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు దక్షిణాదికి చెందినవేనని గత జూన్​లో కేంద్రం లోక్​సభాముఖంగా తెలిపింది. డెబ్భై దశకానికి ముందు కేవలం 9 దేశాలకే పరిమితం అయిన డెంగీ జ్వరాలు తర్వాతి కాలంలో వంద దేశాలకు పైగా పాకింది.

వెన్నులో వణుకు పుట్టిస్తున్న దామకాటు

By

Published : Nov 2, 2019, 10:00 AM IST

Updated : Nov 2, 2019, 7:26 PM IST

తరతమ భేదాలతో దేశంలోని వివిధ రాష్ట్రాలిప్పుడు దోమకాటు బారిన పడి విలవిల్లాడుతున్నాయి. ఈ ఏడాది డెంగీ కసిగా కోరసాచిన అయిదు రాష్ట్రాల్లో నాలుగు దక్షిణాదికి చెందినవేనని గత జూన్‌లో కేంద్రం లోక్‌సభాముఖంగా వెల్లడించింది. నాటి జాబితాలో చోటుచేసుకున్న కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, మహారాష్ట్రలతోపాటు తక్కినచోట్లా డెంగీ విజృంభణ నేడు హడలెత్తిస్తోంది. డెబ్భై దశకానికి ముందు కేవలం తొమ్మిది దేశాలకే పరిమితమైన డెంగీ జ్వరాలు అనంతర కాలంలో వందకు పైగా దేశాలకు విస్తరించాయన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషణ. దేశీయంగా 2013వ సంవత్సరంలో 75 వేలకు పైబడిన కేసుల సంఖ్య మరుసటి ఏడాది కొంత తగ్గి, 2015లో దాదాపు లక్షకు చేరింది. ప్రస్తుత సంవత్సరం అక్టోబరు నాటికే దేశంలో 76 వేలమంది డెంగీ బాధితులున్నారన్న కేంద్ర వైద్యారోగ్య శాఖ నిర్ధారణ, విషజ్వరాలు ఎంతగా ముమ్మరించిందీ ధ్రువీకరిస్తోంది.

వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసుల సంఖ్య

అయిదు నెలల క్రితం 1,303గా కర్ణాటకలో నమోదైన డెంగీ కేసుల సంఖ్య 13 వేలకు పైబడి ఎగబాకుతుండగా, అప్పటికి తెలంగాణలో ఎనిమిది వందల లోపున్న బాధితుల రాశి ఎనిమిదిన్నర వేలకు మించి విస్తరిస్తోంది. ఆ రెంటినీ వెన్నంటి ఉత్తరాఖండ్‌ నిలిచింది. గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, బిహార్‌, తమిళనాడు ప్రభృత రాష్ట్రాల్లోనూ డెంగీ ఉరవడి ఆందోళనపరుస్తోంది. డెంగీతో పాటు దేశ రాజధానిలో మలేరియా, పట్నాలో మదురైలో చికున్‌గన్యా కేసులు పెరుగుతున్నాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌, అహ్మదాబాద్‌, జామ్‌నగర్‌, గాంధీనగర్‌, సూరత్‌, వడోదరా పరిసర ప్రాంతవాసుల్ని డెంగీ ఉద్ధృతి వణికిస్తోంది. పలు ఆస్పత్రుల్లోని ఐసీయూలు (ఇంటెన్సివ్‌ కేర్‌ విభాగాలు) డెంగీ బాధితులతో నిండిపోతుంటే అధికార యంత్రాంగం ఏం దిద్దుబాటు చర్యలు చేపడుతోందన్న తెలంగాణ హైకోర్టు సూటిప్రశ్న, న్యాయపాలిక ధర్మాగ్రహాన్ని ప్రస్ఫుటీకరించేదే. దేశవ్యాప్తంగా సర్కారీ యంత్రాంగాల అలసత్వ ధోరణులకూ ఆ ఆక్షేపణ నేరుగా వర్తించేదే!

సరైన సమయానికి స్పందన కరువైంది

డెంగీ కట్టడికి తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఎనిమిది నెలల నుంచీ అధికారులకు సూచిస్తున్నా దీటైన కార్యాచరణ కొరవడిందన్న ధర్మాసనం- యంత్రాంగం సవ్యంగా స్పందించి ఉంటే జనవరి నాటికి 85గా ఉన్న కేసుల సంఖ్య వేలల్లోకి పెరిగేదా అని నిగ్గదీసింది. ఇప్పటికైనా డెంగీని అదుపు చేయకపోతే దేశంలోనే తొలి స్థానాన తెలంగాణ నిలవాల్సి వస్తుందన్న కేంద్ర పరిశీలక బృందం ఆందోళన పూర్తిగా అర్థవంతమైంది. డెంగీ పాలబడి ప్రాణనష్టం సంభవిస్తున్నా, దోమల నివారణకు మొక్కుబడి చర్యలు తీసుకుంటున్నారని కోర్టు చేత తలంటించుకోవాల్సిన దుస్థితి ఎందుకు దాపురించిందో అధికార గణం ఆత్మశోధన చేసుకోవాలి! వర్షకాలం ప్రారంభం కాకముందే లోతట్టు ప్రాంతాలు, మురికి గుంతల్ని గుర్తించి దోమల లార్వా వృద్ధి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టకపోవడమేమిటని న్యాయస్థానం నిలదీయాల్సిన అవసరమెందుకు ఉత్పన్నమైంది? కోర్టు మొట్టికాయలు వేశాక నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్షలో- దోమలు కొత్తగా ఉత్పత్తి కాకుండా, కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేయడం... చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే.
కొన్ని నెలలుగా ఆస్పత్రుల్లో పడకలు ఖాళీ లేనంతగా విషజ్వరాల కేసులు జోరెత్తాయి. వచ్చిన జ్వరం డెంగీ అవునో కాదో నిర్ధారణ కాకుండానే పరీక్షలు, ప్రత్యేక చికిత్సల పేరిట ప్రైవేటు ఆస్పత్రుల్లో అడ్డగోలు దోపిడి పెచ్చరిల్లింది. డెంగీ బాధిత కుటుంబాలెన్నో ఇప్పటికీ ఆర్తితో మిగిలి పొగులుతున్నాయి. జిల్లాలవారీగా దాదాపు ఏ ఇంట్లో చూసినా రోగుల తాకిడి- అంటురోగాలు, విషజ్వరాల ఉత్పాత నియంత్రణకు ఉద్దేశించిన భారీ వ్యవస్థ ఘోర వైఫల్యాన్నే కళ్లకు కడుతోంది. ధర్మాసనం ములుగర్రతో పొడిచిన తరవాతా, దోమలపై దుర్బల పోరు విస్మయపరుస్తోంది.

ఇది ఏ ఒక్క రాష్ట్ర సమస్యో కాదు

వ్యాధుల ప్రకోపం దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితమైన సమస్య కాదు. మురికివాడల్లోని 70 శాతం పిల్లలకు డెంగీ సంక్రమిస్తున్నట్లు గణాంకాలు చాటుతున్నాయి. నీరు నిల్వ ఉన్న అపరిశుభ్ర బస్తీల్లో డెంగీతోపాటు ఇతర విషజ్వరాలూ ఏటా పడగ విప్పుతున్నాయి. నిరుడు ఏపీలోని ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలు డెంగీ, మలేరియాలతో తల్లడిల్లిపోగా- ఈసారి కర్నూలు, నెల్లూరు, అనంతపురం తదితరాలపైనా విషజ్వరాలు దండెత్తాయి. గత సంవత్సరం మూడొంతుల గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలు, తొమ్మిది జిల్లాల్లో డెంగీ, ఆరు జిల్లాల్లో మలేరియా ముప్పు ఎదుర్కొన్న తెలంగాణలో ఇప్పుడు కేసుల తాకిడి పెరుగుతూనే ఉంది. ఇక్కడే కాదు- అధిక వర్షపాతం, చలి వాతావరణంలో అంటురోగాలు, విషజ్వరాలు ప్రబలే అవకాశాలు ఇంతలంతలవుతాయన్న ముప్పును ఊహించి యంత్రాంగం తగినవిధంగా సన్నద్ధం కాని ప్రతిచోటా ఇదే కథ పునరావృతమవుతోంది.

కాగితాలకే మిగిలిపోయిన కార్యచరణ

పారిశుద్ధ్య చర్యలు, దోమల మందు పిచికారీలపై వైద్యారోగ్య శాఖ పనుపున జారీఅయ్యే ఆదేశాలు చాలావరకు కాగితాలకే పరిమితమవుతున్నాయి. భిన్నశాఖలు, విభాగాల మధ్య సమన్వయమన్నది ఆనవాయితీగా ఎండమావిని తలపిస్తోంది. పైపులైన్ల లీకేజీలు, ఎప్పటికప్పుడు తొలగించని చెత్తకుప్పలు, గుంతలమయమైన రోడ్లు... మశక సంతతి విపరీత వృద్ధికి అత్యంత సానుకూల వాతావరణం ఏర్పరుస్తున్నాయి. పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణలో శ్రీలంక, బల్గేరియా వంటివీ మిన్నగా రాణిస్తుండగా- దేశంలో ఏటేటా విష జ్వరాల ఉత్పాతం వేలాది కుటుంబాల స్థితిగతుల్ని కిందుమీదులు చేసేంతగా పోటెత్తడం దిగ్భ్రాంతపరుస్తోంది. దోమలపై పోరులో రాష్ట్రాలు, దేశం ఇలా చతికిలపడటం జాతికే తలవంపులు. ప్రజారోగ్య పరిరక్షణ కృషితో ముడివడిన విభాగాలన్నీ చిత్తశుద్ధితో విధ్యుక్త ధర్మ నిర్వహణకు నిబద్ధం కావడమే- దుర్భర విషాద ఘట్టాలకు సరైన విరుగుడు!

Last Updated : Nov 2, 2019, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details