లాక్డౌన్ను అనేకమంది ప్రజలు తీవ్రంగా పరిగణలోకి తీసుకోవట్లేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అలక్ష్యం తగదని, అందరూ ఆరోగ్య సూచనలు పాటించాలని సోమవారం ట్విటర్ వేదికగా ప్రజలకు సూచించారు. ఈ నిబంధనను ప్రజలందరూ ఆచరణాత్మకంలో పెట్టేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
"లాక్డౌన్ను అనేక మంది ప్రజలు తీవ్రంగా పరిగణించడం లేదు. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీ కుటుంబాన్ని కాపాడుకోండి. నియమాలను పాటించండి. ఇటలీ, ఇరాన్, స్పెయిన్ అనుభవాలను మరచిపోవద్దు. మూడు దేశాల్లో జరుగుతున్న నష్టాన్ని చూసి కళ్లు తెరవండి. దేశంలో ప్రతి ఒక్క పౌరుడూ తన బాధ్యతను గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు లాక్డౌన్ పాటించేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నా."
- నరేంద్ర మోదీ, ప్రధాని
ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని కరోనా ప్రభావిత ప్రాంతాలైన 80 జిల్లాలను పూర్తిగా మూసివేశాయి. యూపీ, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలోని అధిక జిల్లాలు మూతబడ్డాయి.