దేశంలో ఎన్ని ఘోరాలు, దారుణాలు జరుగుతున్నా... ఒక్క చిన్న సంఘటన చాలు మానవత్వం బతికే ఉందని చెప్పడానికి. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఒక్క చిన్న ఆశ చాలు మనల్ని ముందుకు నడనపటానికి. వీటిని రుజువు చేస్తూ.. దిల్లీలో ఓ ఘటన వెలుగుచూసింది. కరోనాతో బతుకు తెరువు ప్రశ్నార్థకంగా మారిన వృద్ధ దంపతులను ఆదుకునేందుకు ఇప్పుడు దిల్లీ అంతా కదిలి వెళుతోంది.
బాబా కా ధాబా
దిల్లీలోని మాల్వియా నగర్లో ఉంటున్న కాంతా ప్రసాద్, బదామి దేవి దంపతులు.. తమ కష్టాన్ని నమ్ముకుని జీవితాన్ని గడుపుతున్నారు. ఎన్నో ఏళ్లుగా 'బాబా కా ధాబా' పేరుతో రోడ్డుపక్కన ఓ చిన్న బండిలో ఆహార పదార్థాలను అమ్ముకుంటున్నారు. వచ్చిన డబ్బుతో జీవితాన్ని సాగిస్తున్నారు.
అయితే వీరి జీవితాన్ని కరోనా సంక్షోభం ఒక్కసారిగా కుదిపేసింది. కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో వీరి వ్యాపారం మూతపడింది. అన్‌లాక్ తర్వాత తెరుచుకున్నప్పటికీ... ఎవరూ తినేందుకు ముందుకు రావడం లేదు. ఉదయం 6:30 నుంచి అర్ధరాత్రి 1:30గంటల వరకు పని చేస్తున్నా .. రోజుకు రూ.60 మాత్రమే సంపాదించగలుగుతున్నారు. ఫలితంగా పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
ఒక్క వీడియోతో...
ఈ సమయంలోనే దిల్లీకి చెందిన గౌరవ్ వాసన్ అనే వ్యక్తి మాల్వియా నగర్‌కు వెళ్లారు. అక్కడే 'బాబా కా ధాబా'లో పని చేస్తున్న వృద్ధులను చూశారు. వారు పడుతున్న కష్టాలకు చలించిపోయి కన్నీరు పెట్టుకున్నారు. వారి పరిస్థితిని ప్రపంచానికి తెలియజేసేందుకు ఓ వీడియో రూపొందించారు.