మనోహర్ పారికర్... నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా, నిరాడంబర నేతగా, రాజకీయాల్లో విలువలను పాటించిన వ్యక్తిగా పేరు గడించారు. చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ప్రభావితులై రాజకీయాల్లోకి వచ్చారు. అనతికాలంలోనే ఉన్నతపదవులను అలంకరించారు. తాజాగా 71వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పారికర్‌కు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. హౌజ్ ద జోష్ అంటూ మరణానికి కొద్ది కాలం ముందూ జనాలను ఉత్సాహపరచిన పారికర్ ప్రస్థానం సాగిందిలా...
పారికర్ ప్రస్థానం
పారికర్ పూర్తి పేరు మనోహర్ గోపాలకృష్ణ ప్రభు పారికర్. 1955 డిసెంబర్ 13న గోవాలోని మపుసాలో జన్మించారు.
ఐఐటీ విద్యనభ్యసించిన తొలి ఎమ్మెల్యేగా...
మార్గోలోని లయోలా హైస్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు పారికర్. 1978లో ముంబయి ఐఐటీలో మెటలర్జికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఐఐటీలో విద్యనభ్యసించి ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలివ్యక్తిగా గుర్తింపుపొందారు. 2001లో బాంబే ఐఐటీ పారికర్‌ను అల్యుమినస్ అవార్డుతో సత్కరించింది.
పాఠశాలలోనే ఆర్ఎస్ఎస్ వైపు
చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు పారికర్. పాఠశాల విద్యాభ్యాసం ముగిసేనాటికి ఆర్ఎస్ఎస్లో ముఖ్య శిక్షకుడి స్థాయికి ఎదిగారు.
ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తూనే మపుసాలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో పాల్గొన్నారు.
రామ జన్మభూమి ఉద్యమంలో..
26 ఏళ్లకే ఆర్ఎస్ఎస్ సంఘ్‌చాలక్‌గా నియమితులయ్యారు మనోహర్ పారికర్. రామజన్మభూమి ఉద్యమ సమయంలో ఉత్తర గోవాలోని ఆర్ఎస్ఎస్లో కీలక పాత్ర పోషించారు.