దేశాన్ని స్థిరంగా రక్షించిన సాయుధ దళాల ధైర్యం, సంకల్పం మరువలేమన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. సైనికుల శౌర్యం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. నాటి కార్గిల్ వీరుల పరాక్రమాలు, వీరమాతల త్యాగాలకు సంబంధించిన కథనాలను ఇతరులకు షేర్ చేయాలన్నారు మోదీ. దేశ సమగ్రతకు సైనికులు చూపే ధైర్య సాహసాలకు వందనమని ఉద్ఘాటించారు ప్రధాని.
'వాజ్పేయీ వ్యాఖ్యలు అనుసరణీయం'
కార్గిల్ సమయంలో ఎర్రకోట నుంచి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ చేసిన ప్రసంగం ఇప్పటికీ అనుసరణీయమన్నారు మోదీ. ఏ కీలక నిర్ణయమైనా తీసుకునేముందు సైనికుల ప్రయోజనాలు కూడా ఆలోచించాలని వాజ్పేయీ పేర్కొన్నట్లు చెప్పారు.
ఐక్య పోరుతోనే..
గత కొద్దినెలలుగా కరోనాపై భారత్ ఐక్యంగా పోరాడుతోందని చెప్పారు మోదీ. ఈ కారణంగానే పలు దేశాల కంటే రికవరీ రేటు ఎక్కువగా ఉందని వెల్లడించారు. ప్రారంభంలో ఉన్నంత ప్రమాదకరంగానే వైరస్ ప్రభావం ప్రస్తుతం కూడా ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మహమ్మారి నియంత్రణ దిశగా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.