రాజ్యసభకు మన్మోహన్ దూరం? మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కొంత కాలం రాజ్యసభకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూన్ 14తో కాంగ్రెస్ సీనియర్ నేత పదవీకాలం ముగియనుండటమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు ఆరుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు మన్మోహన్.
సార్వత్రిక ఎన్నికలే కీలకం...
రాజ్యసభలోని పలువురు కాంగ్రెస్ నేతలు సార్వత్రిక ఎన్నికల్లో పోటిచేస్తున్నారు. వీరిలో ఎవరైనా విజయం సాధించి తమ రాజ్యసభ సీటును వదులుకునేంత వరకు మన్మోహన్ ఎగువ సభకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
అసోంలోని రెండు రాజ్యసభ సీట్లకు జూన్ 7న ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఒక స్థానానికి మన్మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసోంలో భాజపా ప్రభుత్వం ఉండటం వల్ల మాజీ ప్రధానిని తిరిగి ఎన్నుకునేందుకు సరిపడా బలం హస్తం పార్టీకి లేదు.
2020 ఏప్రిల్ వరకు...
జులైలో తమిళనాడు నుంచి ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి. కాంగ్రెస్తో స్నేహబంధం దృష్ట్యా వీటిలో ఒక సీటును డీఎంకే పార్టీ మన్మోహన్కు అప్పగించే అవకాశాలున్నాయి. అలా జరగకపోతే పెద్దల సభలో అడుగుపెట్టేందుకు ఏప్రిల్ 2020 వరకు మాజీ ప్రధాని వేచిచూడాల్సిందే. ఆ సమయానికి వివిధ రాష్ట్రాల్లోని 55 స్థానాలు ఖాళీ అవుతాయి.
ఇదీ చూడండి: ఆంగ్ల నిఘంటువులో కొత్త పదం 'మోదీ లై': రాహుల్