'కశ్మీరీ బ్లడ్ మ్యాన్'గా గుర్తింపు పొందిన షాబిర్ హుస్సేన్ ఖాన్.. రక్తదానం చేయడమే తన అలవాటుగా మార్చుకున్నాడు. 39 ఏళ్లుగా ఏటా నాలుగైదు సార్లు రక్తదానం చేస్తూ.. యువతకు దాని విలువ తెలియజేస్తున్నాడు.
13 ఏళ్ల వయసులోనే...
చూడడానికి సాదాసీదాగా కనిపించే 50 ఏళ్ల ఖాన్ మనసులో.. భారీ ఆశయమే ఉంది. ఆనందమనేది మార్కెట్లో దొరికే వస్తువు కాదని, చిరునవ్వుతో వచ్చే సంతృప్తి అని బాల్యంలోనే గ్రహించాడు. అవును, శ్రీనగర్, షేర్ ఏ ఖాస్, నౌహట్టాకు చెందిన ఖాన్ 1980లో తన స్నేహితుడి కోసం తొలిసారిగా రక్తదానం చేశాడు. అప్పుడు ఖాన్ వయసు కేవలం 13 ఏళ్లు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఓ ఐదు సార్లు రక్తదానం చేయడం ఖాన్కు జీవితంలో భాగమైపోయింది.
ఇప్పటికే 171 పింట్ల రక్తదానం చేశాడు ఖాన్. ఒక్కో పింట్ ప్యాకెట్లో దాదాపు 475 మిల్లీలీటర్ల రక్తం ఉంటుంది. ఇంత రక్తం ధారపోసినా..తాను ఆరోగ్యంగానే ఉన్నానంటున్నాడు ఖాన్. అంతే కాదు.. మరో 15 ఏళ్లపాటు... రక్తదానం చేయడం ఆపబోనని... ఇది ఆరోగ్యవంతమైన పౌరుల కర్తవ్యం అని అంటున్నాడు. ఇందుకు తన కుటుంబ సహకారమూ ఉండడం విశేషం.
"ఏటా నాలుగైదు సార్లు రక్తదానం చేస్తాను. ఈ అలవాటు నా ఆరోగ్యాన్ని ఏమాత్రమూ ప్రభావితం చేయలేదు. పైగా నా నెత్తుటి చుక్క వల్ల కొందరి ప్రాణాలు నిలుస్తాయి.. ఇది నాకెంతో సంతృప్తినిస్తోంది. అలా అలవాటైపోయింది. నాకు 65 ఏళ్లు వచ్చేంతవరకు నేను రక్తదానం ఆపను. ఎందరో ముఖాల్లో చిరునవ్వులు, ప్రజల నుంచి వచ్చే సానుకూల స్పందన నాకు హాయినిస్తాయి. డబ్బే సర్వస్వం అనుకుంటున్న ఈ తరం యువకులు.. రక్తదానం చేసి, ఇతరుల ప్రాణాలు కాపాడితే... దేవుడికి సేవ చేసినట్టేనని గుర్తించాలి"