చేసిన పనికి వేతనం అడిగిన ఉద్యోగిని సజీవ దహనం చేశాడు ఓ మద్యం షాపు యజమాని. ఈ ఘటన రాజస్థాన్ అల్వార్ నగరంలోని ఖైర్థల్లో జరిగింది.
ఇదీ జరిగింది
కమలేశ్ అనే వ్యక్తి... ఉపాధి కోసం ఓ మద్యం దుకాణంలో పనిలో చేరాడు. తాను చేసిన కష్టానికి యజమాని జీతం చెల్లించకపోయిన.. నమ్మకంతో ఐదు నెలలు పని చేశాడు. అయినా యజమాని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో తన జీతం చెల్లించాలని డిమాండ్ చేశాడు కమలేశ్.
జీతం ఇవ్వలేదు సరికదా... కమలేశ్‌పై పెట్రోలు పోసి నిప్పంటించాడు యజమాని, కమలేశ్ సహచరులు. తనను తాను రక్షించుకోవడానికి డీప్ ఫ్రిజ్‌లోకి వెళ్లాడు బాధితుడు. అప్పటికే పూర్తిగా కాలిపోయిన కమలేశ్... అందులోనే ప్రాణాలు విడిచాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చినీయాంశంగా మారింది. దీనిపై అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లిందని ఆరోపించాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం.
ఇదీ చూడండి:హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచు వర్షం