అండమాన్‌కు చెందిన ఓ వ్యక్తి నడి సముద్రంలో చిక్కుకొని 28 రోజుల తర్వాత ఒడిశా తీరానికి చేరుకున్నాడు. అండమాన్ నుంచి తనతోపాటు వచ్చిన స్నేహితుడు మధ్యలోనే చనిపోగా.. ఒడిశాలోని ఖిరిసాహి అనే తీర గ్రామానికి అతడు ఉన్న పడవ శుక్రవారం కొట్టుకొచ్చింది. అండమాన్ నుంచి ఒడిశా తీరం 750 నాటికల్ మైళ్లు (1300 కిలోమీటర్లు) కావడం గమనార్హం.
అలా మొదలైన ప్రయాణం..
అమృత్ కుజుర్ (49) తన స్నేహితుడు దివ్యరాజన్‌తో కలిసి సెప్టెంబరు 28న సముద్రంలోకి బయలుదేరాడు. వివిధ సరకులు, తాగునీటిని సముద్రంలో వచ్చిపోయే నౌకలకు విక్రయించే వ్యాపారం వారిది. ఇలా రూ.5 లక్షల విలువైన సరకులతో ఓ మర పడవలో అండమాన్ నికోబార్ దీవుల్లోని షాహిద్ ద్వీప్ నుంచి బయలుదేరాడు. ఈ లోపు తుపాను వచ్చి తమ మరపడవ.. గతి తప్పిపోయింది. ఇంధనం అయిపోవడమే కాక, పడవ పైభాగం దెబ్బతిన్నది. సాయం కోసం వారి వద్ద ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పాడైంది. దీంతో పడవలో బరువు తగ్గించుకోవాలని వారు తీసుకొచ్చిన సరకులన్నింటినీ సముద్రంలో పారేశారు. సాయం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా అటుగా వెళ్లే ఏ నౌకా వారిని గుర్తించలేదు. చివరికి మయన్మార్‌కు చెందిన ఓ నౌకాదళ ఓడ వారి వద్దకు వచ్చి 260 లీటర్ల డీజిల్, కంపాస్ ఇచ్చి సాయం చేసింది.
ఇంటి ముఖం పడుతున్న సమయంలో బంగాళాఖాతంలో వారు మరో తుపాను ఎదుర్కోవాల్సి వచ్చింది. రాకాసి గాలులకు వారి మర పడవ మరింత దెబ్బతిన్నది. భారీ అలలకు లోపలకునీళ్లు చేరాయి. ఇంజిన్ ఆన్‌లోనే ఉంచడం వల్ల అదృష్టవశాత్తు పడవ బోల్తా పడలేదు.