తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వెదురు పొదరిల్లు- పక్షులు, పాములే కుటుంబ సభ్యులు - burdwan man staying in bamboo hut

వెదురు పొదల నడుమ ఓ ఇరుకైన గుడిసెలో ఒక వ్యక్తి నివాసముంటున్నాడు. అతనికి పక్షులు, కీటకాలు, పాములతో చెలిమి కుదిరింది. అడవిలోనే అతడికి అనంతమైన ప్రేమ దొరికింది. బంగాల్​లోని ఓ మారుమూల గ్రామంలో 20 ఏళ్లుగా ప్రకృతితో మమేకమైన ఆ వ్యక్తి కథ తెలుసుకోవాల్సిందే..

Man living in bamboo shrub for 20 years has birds as housemates in burdwan, west bengal
'వెదురు పొదరింట్లో.. పక్షులు, పాములే నా కుటుంబ సభ్యులు!'

By

Published : Aug 25, 2020, 11:02 AM IST

వెదురు పొదరిల్లు- పక్షులు, పాములే కుటుంబ సభ్యులు

బంగాల్, బుర్ద్వాన్ జిల్లాలోని మారుమూల పాలిత్ పుర్ గ్రామంలోకి ప్రవేశించగానే.. ఓ వెదురు పొద మన దృష్టిని ఆకర్షిస్తుంది. అందులో ఓ ప్లాస్టిక్ సంచుల కుప్ప కనిపిస్తుంది. కానీ, ఆ సంచులను తొలగించి చూస్తే అందులోనే ఓ చిన్ని గుడిసె దర్శనమిస్తుంది. అదే లోకూరాయ్ సామ్రాజ్యం. ఇరుకైన ఆ గుడిసెలో అస్తవ్యస్తంగా పడున్న సామాన్ల నడుమనున్న ఓ మంచమే 20 ఏళ్లుగా ఆయన నివాసం.

భార్యావిరహుడై.. ప్రకృతి ప్రేమికుడై

పాలిత్ పుర్ గ్రామానికి చెందిన లోకూరాయ్(50)కు భార్యే సర్వస్వం. కానీ, 20 ఏళ్ల క్రితం విధి ఆమెను శాశ్వతంగా దూరం చేసింది. భార్య మరణం తర్వాత లోకూరాయ్ ఒంటరివాడైపోయాడు. కూతురు, కుమారులు పెళ్లిళ్లు చేసుకుని ఎవరిదారి వారు చూసుకున్నారు. దానికి తోడు, ఓ ప్రకృతి విపత్తులో లోకూ ఇల్లు కూలిపోయింది. దీంతో, ఉదయం లేచినప్పటి నుంచి పొలంలో వ్యవసాయ పనులు చేసుకుని పక్కనే ఉన్న వెదురు పొదలో సేదతీరుతూ గడిపేవాడు. అప్పుడే లోకూకు ప్రకృతితో విడదీయరాని అనుబంధం ఏర్పడింది.

ఎండా, వానల నుంచి తల దాచుకునేందుకు దొరికిన ప్లాస్టిక్ సంచులతో వెదురు పొదలో ఓ గుడిసె నిర్మించుకున్నాడు లోకూ. ప్రకృతి వీచే గాలే తనకు ఏసీ. ఓ పాత టార్చ్ లైటే తనకు వెయ్యి ఓల్టుల బల్బు. ఇక ఉదయాన్నే వినిపించే పక్షుల కిలకిలారావాలే తనకు అలారం అంటున్నాడు లోకూ. లోకూ గుడిసె పక్కనే ప్రవహించే ఓ కాలువలో వలవేసి చేపలు పెట్టేస్తాడు. రోజూ అందులో చిక్కే చిట్టి చేపలే లోకూ ఆహారం. తనకు డబ్బులు కావల్సివస్తే గ్రామంలో చిన్నాచితకా పని చేసుకుంటాడు. ఎక్కడికెళ్లినా తిరిగి రాత్రి వరకల్లా తన పొదరింటికి చేరుకుంటాడు లోకూ.

ప్రకృతే కుటుంబం!

ఆ గ్రామంలో ఎవరికి లేనంత అందమైన కుటుంబం లోకూ సొంతం. పక్షులు, సాలె పురుగులు, కీటకాలు లోకూ కుటుంబ సభ్యులు. పాములు తనకు స్నేహితులు. తన గుడిసె చుట్టూ తిరిగే ఓ పాముతో లోకూ స్నేహం ఏళ్ల నాటిదిట. అందుకే, బుర్ద్వాన్ జిల్లాలో లోకూ "గచ్ బాబా"గా పేరు గాంచాడు. కుటుంబాన్ని, ఇంటిని పోగొట్టుకుని మానసికంగా కుంగిపోయిన లోకూ ఇలా ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా జీవితం గడేపేస్తున్నాడు.

ఇదీ చదవండి:రెండు కుటుంబాల మధ్య పబ్​జీ చిచ్చు- ఐదుగురికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details