కేరళ, కన్నూర్ జిల్లాలోని తళిపరంబలో ఉన్న ఈ ఇల్లు.. చిట్టిపొట్టి చెట్లతో నిండిపోయి కనిపిస్తుంది. ఈ ఇల్లు సులేమాన్ నివాసమే కాదు...400రకాలకు పైగా బొన్సాయ్ చెట్లకు నిలయం. ఎక్కడచూసినా బొన్సాయ్ చెట్లతో ఉన్న చిన్నకుండీలే దర్శనమిస్తాయి. మేడమీద, ఇంటిముందు ఖాళీస్థలమంతా నిండిపోయిన వాటికి తన మనసులోనూ ప్రత్యేక స్థానమిచ్చాడు సులేమాన్.
బొన్సాయ్ అంటే జపనీస్ భాషలో చిన్నకుండీలో పెరిగిన చెట్టు అని అర్థం. పూర్తిగా పెరిగిన వృక్షాల్లాగే అచ్చుగుద్దినట్లు చిన్నపరిమాణంలో ఉంటాయి. పరిసరాలకు అదనపు అందం తెచ్చిపెట్టే ఈ బొన్సాయ్‌లు.. ఎవ్వరి దృష్టినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. సూర్యరశ్మి, నీరు, ఎరువుల సరఫరాను నియంత్రించి, కాండాన్ని మెలిపెట్టి, తిప్పడం ద్వారా సాధారణ చెట్టు ఎదుగుదలనే నియంత్రించి బొన్సాయ్‌లుగా చేస్తారన్న అభిప్రాయం చాలామందిలో ఉంది.
అయితే అది నిజం కాదు. పెద్ద చెట్టు లక్షణాలే బొన్సాయ్‌లోనూ పూర్తిస్థాయిలో ఉంటాయి. సులేమాన్ చిట్టితోటలో.. పూల మొక్కలూ, చిన్నచిన్న పండ్లు కాసే సపోటా చెట్లు, చింత, మర్రిచెట్లు సహా ఎన్నో బుజ్జి వృక్షాలు కుండీల్లో దర్శనమిస్తాయి. 400లకు పైగా చిట్టిచెట్లను సులేమాన్ పెంచుతున్నాడు.
65, 25, 15 ఏళ్ల వయసున్న బొన్సాయ్ మర్రిచెట్లు, వీపింగ్ ఫిగ్‌గా సుపరిచితమైన ఫికస్ బెంజామినా చెట్లు, పదేళ్ల వయసున్న సపోటా చెట్టు, 25 ఏళ్ల చింతచెట్టు సులేమాన్ ఇంట ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటన్నింటిలో ఐదేళ్ల వయసున్న మర్రిచెట్టు ధర తక్కువ. దీని ధర 2వేల రూపాయలని చెప్తున్నాడు సులేమాన్.
"నేనోసారి కోజికోడ్‌లో ఒక పూల ప్రదర్శనకు వెళ్లాను. చిన్నచిన్న కుండీల్లో ఉన్న చిట్టిచెట్లను అక్కడ చూశాను. అవి నన్ను బాగా ఆకర్షించాయి. ఇష్టం కొద్దీ వాటి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను."