ఆస్తి కాజేసేందుకు బంధువుకు కుటుంబ నియంత్రణ..! భూ వివాదాల వల్ల కుటుంబాల్లో తగాదాలు ఉండటం సాధారణంగా వింటూనే ఉంటాం. ఎలాగైనా ఆస్తి కాజేయడానికి బెదిరింపులు, హత్యల వరకూ దారి తీసిన వార్తలూ చూస్తూనే ఉంటాం. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి... ఆస్తి కోసం తన బంధువుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాడు. తన బంధువుకు పిల్లలు పుట్టకుండా చేసి ఆస్తిని సొంత చేసుకుందామని పథకం పన్నాడు.
ఇదీ జరిగింది...
మాధురి దేవీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రావత్పుర్ వాసి. ఆమెకు ఇద్దరు సంతానం. కూతురి వివాహం జరిగింది. ప్రస్తుతం తన 22 ఏళ్ల కొడుకు ఆనంద్‌తో జీవిస్తోంది.
10 ఏళ్ల క్రితం మాధురి భర్త మరణించాడు. మాధురికి నాలుగు బిఘాల వ్యవసాయ క్షేత్రం.. 83 గజాల భూమి ఉంది. తన కొడుకుతో ఆ 83 గజాల భూమిలో ఇల్లు కట్టుకుని నివసిస్తోంది మాధురి. ఆ భూమిపై ఆమె బంధువు శివనాథ్ కన్నేశాడు. ఎలాగైనా ఆస్తిని దక్కించుకోవాలని పథకం పన్నాడు.
ఈ నెల 14న ఓ పనిపై డబల్పులియాకు బయలుదేరాడు ఆనంద్. ఆ దారిలో ఆనంద్‌ను శివనాథ్ అడ్డగించాడు. ముగ్గురు స్నేహితులతో ఆనంద్‌ను బలవంతంగా ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆనంద్‌కు మత్తుమందు ఇచ్చి.. కొన్ని కాగితాలపై వేలిముద్రలను తీసుకున్నాడు. ఆ వెంటనే ఆనంద్ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. అపస్మారక స్థితి నుంచి కోలుకున్న ఆనంద్... ఇంటికి వెళ్లి జరిగిందంతా తన తల్లికి చెప్పుకుని బిక్కుబిక్కుమంటూ ఏడ్చాడు.
రెండు రోజుల తర్వాత కొడుకుతో ఆసుపత్రికి వెళ్లింది మాధురి. అప్పుడే ఒక నమ్మలేని నిజం ఆ తల్లికి తెలిసింది. ఆస్తి కోసం శివనాథ్.. తన బిడ్డకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాడని తెలుసుకున్న మాధురి కన్నీరు మున్నీరుగా విలపించింది.
కొడుకుకి సంతానం లేకపోతే తన ఆస్తి దక్కుతుందనే శివనాథ్.. ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని మాధురి ఆరోపించింది.
శివనాథ్ ఆసుపత్రిలో తనను భయపెట్టి ఓ కాగితంపై వేలి ముద్ర వేయించుకున్నాడని ఆరోపించాడు ఆనంద్. ఈ పూర్తి వ్యవహారంపై కల్యాణ్‌పుర్ పోలీసులను సంప్రదించారు ఆ తల్లి-కొడుకు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి- ప్లాస్టిక్ భూతం: ఆవు కడుపులో 45 కిలోల పాలిథీన్