తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్యపై ప్రేమతో అడవినే సృష్టించాడు - ఖాదల్ నాయక్

సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని రుజువు చేశాడు ఒడిశా ఖేత్​ముందలీ పంచాయతీలోని దుబపల్లి గ్రామానికి చెందిన ఖాదల్ నాయక్. తను ప్రాణంగా ప్రేమించే భార్యకు గుర్తుగా కొండపై ఏకంగా హరిత అరణ్యాన్నే సృష్టించాడు.

MAN-FOREST
భార్యపై ప్రేమతో అడవినే సృష్టించాడు..

By

Published : Jan 26, 2020, 7:16 AM IST

Updated : Feb 18, 2020, 10:47 AM IST

భార్యపై ప్రేమతో అడవినే సృష్టించాడు

ఖాదల్​ నాయక్​కు అతని భార్యంటే అమితమైన ప్రేమ. ప్రసవ సమయంలో బిడ్డకు జన్మనిచ్చి ఆమె ప్రాణాలు కోల్పోయింది. భార్య మృతిని తట్టుకోలేకపోయాడు ఖాదల్​. ఆమెను జీవితాంతం గుర్తుంచుకునేలా ఏమైనా చేయాలని నిశ్చయించుకున్నాడు. కొండ ప్రాంతంలో తాను కొనుగోలు చేసిన ఐదెకరాల భూమిలో చెట్లు నాటాలనుకున్నాడు. ఆలోచనే తడవుగా ఆచరణలో పెట్టాడు.

40 ఏళ్లుగా

40 ఏళ్ల క్రితం ఖాదల్​ నాటిన మొదటి మొక్క ఎండిపోయింది. ఒక్క చెట్టు కూడా లేని కొండపైన నాటుతున్నాడేంటని గ్రామస్థులు ఖాదల్​ను ఎగతాళి చేసేవారు. అవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూపోయాడు. కొన్ని రోజుల తర్వాత వృక్షాలు పెరిగాయి. వాటికి రోజూ నీరు పోస్తూ కాపాడేవాడు. అప్పటి నుంచి అదే పనిగా చెట్లు నాటుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రాంతమంతా సుందరమైన అరణ్యంగా మారింది. ఖాదల్​ సంకల్పానికి గ్రామస్థులు ముగ్ధులయ్యారు.

ఈ అడవికి తన భార్య పేరు 'శోవా'ను జోడించి శోవాబన్​గా నామకరణం చేశాడు ఖాదల్. తన భార్యను ఈ వృక్షాల్లో చూసుకుంటున్నట్లు తెలిపాడు. భవిష్యత్తులో ఈ అడవిని తన పిల్లలు సంరక్షిస్తారని చెప్పాడు.

" నాకు చిన్నతనంలోనే వివాహమైంది. బిడ్డకు జన్మనిచ్చి నా భార్య మరణించింది. ఆమె మృతితో మనోవేదనకు గురయ్యాను. కొండపై జీవించాలని వచ్చాను. ఇక్కడ చెట్లను పెంచాలనుకున్నా. మొదట్లో విఫలమయ్యా.. కానీ తర్వాత విజయం సాధించాను. ఎంతోమంది సాయంతో అడవిని వ్యాపింపజేశాను. దొరికినన్ని విత్తనాలు, వేర్లు ఇక్కడ నాటే వాడిని. నేను చనిపోయాక నా పిల్లలు ఈ అరణ్యాన్ని సంరక్షిస్తారు. ఒక్కొక్కరు ఒక్క చెట్టు నాటితే కొన్ని కోట్ల వృక్షాలవుతాయి. పర్యావరణానికి మేలు జరుగుతుంది."

-ఖాదల్ నాయక్, అడవి సృష్టికర్త

రెండో భార్య సహకారం

ఖాదల్​ నాటిన మొక్కలకు నీరు పోస్తూ వాటిని సంరక్షిస్తోంది అతని రెండో భార్య బిలాస్ నాయక్​. ఆయన చెట్లను పెంచడం సంతోషంగా ఉందని... ఎల్లవేళలా తనవంతు సాయం అందిస్తానని చెబుతోంది.

బంజరు భూమి కొండపై చెట్లు బతికే అవకాశాలు చాలా తక్కువ. అలాంటి ప్రాంతంలో ఒక్క చెట్టు నాటి ఇప్పుడు ఏకంగా అడవిగా మార్చిన ఖాదల్ సంకల్ప శక్తిని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఈ కొండప్రాంతంలో టేకు, ఫైసల్ చెట్లను ఎక్కువగా నాటుతున్నారు. వాటికి రోజు నీరు అందిస్తున్నారు.

ఇదీ చదవండి:నితిన్​ గడ్కరీ బౌలింగ్​లో.. హార్దిక్​ పాండ్య సిక్సర్

Last Updated : Feb 18, 2020, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details