కరోనా పేరు చెబితేనే ప్రజలు వణకిపోతున్నారు. ఆ మహమ్మారి తమ ప్రాణాలను ఎక్కడ బలిగొంటుందో అనే భయంతో బిక్కుబిక్కమంటూ జీవిస్తున్నారు. కేరళ కడక్కల్‌కు చెందిన అనిలన్ మాత్రం కరోనాను దేవతగా కొలుస్తున్నాడు. ఇంట్లో రోజూ పూజలు చేస్తున్నాడు. కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, వ్యాక్సిన్ అభివృద్ధికి శ్రమిస్తున్న శాస్త్రవేత్తల క్షేమం కోసమే తాను ఇలా చేస్తున్నానని చెబుతున్నాడు అనిలన్. పూజలు చేస్తే కరోనా దేవి వారిని కాపాడుతుందంటున్నాడు.
అనిలన్ తీరుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల మంది మృతికి కారణమైన వైరస్‌ను పూజించడమేంటని మండిపడుతున్నారు. ఉచిత ప్రచారం కోసమే అనిలన్ ఇలా చేస్తున్నాడని మరికొందరు అంటున్నారు.
నేనింతే..
సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోలింగ్స్‌ను తాను పట్టించుకోనని చెప్పాడు అనిలన్. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపాడు.
"33 కోట్ల మంది దేవుళ్లను హిందువులు ఆరాధిస్తారు. నేను వైరస్‌ను దేవతగా కొలుస్తున్నా. ఇష్టమైన వారిని పూజించడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కరోనా దేవిని పూజించాలనుకునే భక్తులను నా ఇంటికి మాత్రం రానివ్వను. వారు ఇచ్చే కానుకలు కూడా తీసుకోను."