బంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ... రాజకీయ వేడి పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ పట్టు సంపాదించడానికి భాజపా వ్యూహాలు రచిస్తోంది. తాజాగా మమతా బెనర్జీ మైనార్టీ తీవ్రవాదంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఏఐఎమ్ఐఎమ్ అధ్యక్షుడు ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీదీ వ్యాఖ్యలు...
కూచ్ బిహార్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మమత.. ఓవైసీపై పరోక్ష విమర్శలు చేశారు.
"మైనార్టీల్లో కొంతమంది తీవ్రవాదులు ఉన్నారు. మైనార్టీలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. వారు హైదరాబాద్కు చెందినవారు. వాళ్ల మాటలు అసలు వినొద్దు. వారు చేసే వ్యాఖ్యలను అసలు నమ్మొద్దు." - మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
ఓవైసీ కౌంటర్...
మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. బంగాల్‌లో ముస్లింల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మానవాభివృద్ధి సూచిక తెలియజేస్తోందన్నారు.
"బంగాల్‌లో ఉన్నంత దారుణంగా ముస్లింల పరిస్థితి ఎక్కడా లేదు. హైదరాబాద్కు చెందిన తమ లాంటి వారిపై విమర్శలు చేసే మమతా బెనర్జీ ... లోక్‌సభ ఎన్నికల సందర్భంగా భాజపా 18 సీట్లను ఎలా గెలిచిందో చెప్పాలి. నాపై దీదీ విమర్శలు చేయడమంటే.. బంగాల్‌లో ఎంఐఎం పార్టీకి బలం ఉన్నట్లు ఒప్పుకున్నట్లే. అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. - అసదుద్దీన్ ఓవైసీ, ఏఐఎమ్ఐఎమ్ అధినేత
ఈశాన్య, ఉత్తర భారతంలో ఏఐఎమ్ఐఎమ్ పార్టీని విస్తరించేందుకు ఓవైసీ పట్టుదలగా ఉన్నారు. ఈ మధ్యే బిహార్‌లోని కిషన్‌గంజ్ అసెంబ్లీ స్థానాన్ని ఆ పార్టీ గెలుచుకుంది.