తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధానితో భేటీకి వచ్చేదిలేదు: మమతా బెనర్జీ - పశ్చిమ బంగ

దిల్లీలో ప్రధాని మోదీతో బుధవారం జరగనున్న పార్టీ అధినేతల భేటీకి మమతా బెనర్జీ గైర్హాజరు కానున్నారు. 'ఒకే దేశం-ఒకే ఎన్నికల'పై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. అలా చేసినప్పుడే సమావేశంలో పాల్గొంటామని పార్లమెంట్ వ్యవహారాల మంత్రికి లేఖ రాశారు.

ప్రధానితో భేటీకి వచ్చేదిలేదు: మమతా బెనర్జీ

By

Published : Jun 18, 2019, 5:15 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరగనున్న పార్టీ అధినేతల మీటింగ్​కు పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూరంగా ఉండనున్నారు. హడావిడిగా చేసే బదులు 'ఒకే దేశం-ఒకే ఎన్నికల'పై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని దీదీ డిమాండ్​ చేశారు. ఈ అంశంపై నిపుణులతో చర్చించాల్సిన అవసరముందని పార్లమెంట్​ వ్యవహారాల మంత్రికి లేఖ రాశారు.

" ఒకే దేశం-ఒకే ఎన్నికలపై శ్వేతపత్రం విడుదల చేయండి. అలాగే ఈ విషయంపై చర్చించుకునేందుకు అన్ని పార్టీలకు తగిన సమయం ఇవ్వండి. మీరు అలా చేసినప్పుడే ఇంతటి ప్రధాన అంశంపై విలువైన సూచనలు అందించగలం. మహాత్మా గాంధీ 150వ జయంతి, 75 సంవత్సరాల స్వతంత్ర భారత వేడుకల్లో నాతో పాటు మా పార్టీ నేతలు పాల్గొంటారు."
- మమతా బెనర్జీ, పశ్చిమ బంగ ముఖ్యమంత్రి

లోక్​సభలో కానీ రాజ్యసభలోగానీ కనీసం ఒక ఎంపీ ఉన్న పార్టీ అధినేతలు జూన్​ 19న దిల్లీలో తనతో భేటీ అవ్వాలని ఆహ్వానం పంపారు మోదీ. 2022 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. అలాగే ఈ ఏడాదిలో మహాత్మా గాంధీ 150వ జయంతి జరగనుంది. ఈ నేపథ్యంలో 'ఒకే దేశం-ఒకే ఎన్నికల'తో పాటు మరిన్ని విషయాలపై చర్చిద్దామని ప్రధాని వీరందరినీ ఆహ్వానించారు. ఆ మరుసటి రోజే(జూన్​ 20న) పార్లమెంట్​లోని ఎంపీలందరికీ ప్రధాని విందు ఏర్పాటు చేయనున్నారు.

ఫిరాయింపు నేతలపై మండిపాటు

లోక్​సభ ఎన్నికల అనంతరం పార్టీ ఫిరాయించిన తృణమూల్​ కాంగ్రెస్​ నేతలపై మమత మండిపడ్డారు. వారంతా అవినీతి, అత్యాశ పరులని ఆరోపించారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డ వారందరూ కేంద్రం ఏమైనా చేస్తుందేమోననే భయంతోనే వేరే పార్టీలో చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ చెత్తను పారవేస్తుంటే భాజపా అదంతా సమకూర్చుకుంటోందని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details