బంగాల్ను మమతా బెనర్జీ అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్లారని కేంద్ర హెంమంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. బంగాల్లో పరిస్థితులు వామపక్షాల పాలన కంటే ఘోరంగా మారిపోయాయని ఆరోపించారు. హావ్డాలో జరిగిన భాజపా ర్యాలీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన షా.. రాష్ట్ర ప్రజలు ఆమెను ఎప్పటికీ క్షమించరని అన్నారు.
తృణమూల్ కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల నేతలంతా భాజపాలో చేరుతున్నారని, ఎన్నికల సమయానికి దీదీ ఒంటరిగా మారిపోతారని చెప్పుకొచ్చారు అమిత్ షా. రాష్ట్ర ప్రజలకు మమత అన్యాయం చేశారని అన్నారు. ఈ విషయంపై మమత ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. మోదీ ప్రభుత్వం ప్రజా సేవ చేస్తుంటే.. దీదీ మాత్రం తన మేనల్లుడి కోసమే పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.
"'మా, మాటి, మనుష్'(అమ్మ, నేల, ప్రజలు- టీఎంసీ నినాదం) అంటూ టీఎంసీ ప్రగల్భాలు పలుకుతోంది. కానీ రాష్ట్రంలో వాస్తవానికి అవినీతి, దోపిడీ మాత్రమే ఉన్నాయి. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుంది. ఎందుకు టీఎంసీ నేతలు భాజపాలో చేరుతున్నారో మమత ఆలోచించాలి. ఎందుకంటే దీదీ విఫలమయ్యారు. ఎన్నికల సమయానికి ఒంటరిగా మిగిలిపోతారు."