పశ్చిమ్‌బంగాలో దుర్గామాత ఉత్సవాలను ప్రారంభించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కరోనా నేపథ్యంలో దృశ్య మాధ్యమం ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు మమత. నదియా జిల్లా నుంచి వేడుకలకు హాజరైన దీదీ.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 69 చోట్ల వేడుకలను ఆరంభించారు.
ఈ ఏడాది దుర్గా పూజోత్సవాలు అక్టోబర్ 23 నుంచి 26 వరకు జరగనున్నాయి. కొవిడ్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఉత్సవాలపై నిషేధం విధించింది కేంద్రం. అయితే.. రాష్ట్ర ప్రజల అభ్యర్ధన మేరకు బంగాల్లో వేడుకల నిర్వహణకు అనుమతినిచ్చింది తృణమాల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వం. కరోనా నిబంధనలను పాటిస్తూ శాంతియుతంగా పూజలు నిర్వహించుకోవాలని ఆలయ కమిటీ అధికారులకు సూచించారు మమత.
"మేమంతా దుర్గామాత ఆశీర్వచనాన్ని కోరుతున్నాము. తగిన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ అమ్మవారిని ఆరాధిస్తాం. కరోనా ప్రభావంతో ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఉత్సవాలు కూడా లేకపోతే వారు మరింత మానసిక ఒత్తిడికి గురవుతారు. అందువల్ల కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కించమని దుర్గామాతను వేడుకుందాం."