కరోనా కాలంలో విధించిన లాక్డౌన్తో ఎన్నో కుటుంబాల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది. చాలా మంది ఉపాధి కోల్పోయి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అయితే కేరళ మలప్పురంలో బీఈడీ చదువుతున్న ఓ యువతి తన కుటుంబ పోషణ కోసం వినూత్న పద్దతిని ఎంచుకుంది. మహిళపై సమాజంలో ఉన్న భావాలను పక్కకు నెట్టేసి.. తన తండ్రితో కలిసి కొబ్బరి చెట్లను ఎక్కడం ప్రారంభించింది.
కాదంబుజా ప్రాంతంలో నివాసముంటున్న శ్రీదేవి బీఈడీ చివరి సంవత్సరం చదువుతోంది. తండ్రి గోపాలన్ కొబ్బరి చెట్ల తోటలో కూలీ పని చేస్తున్నాడు. కొబ్బరి కాయలను కోస్తూ.. వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. శ్రీదేవి.. లాక్డౌన్కు ముందు తండ్రికి చేయూతగా ఉండేందుకు ట్యూషన్ క్లాసులు చెప్తుండేది. ఆంక్షల కారణంగా రెండు నెలలకు పైగా సంపాదన నిలిచిపోయింది. ఈ క్రమంలో.. భౌతిక దూరం పాటిస్తూనే పని చేయగల ఆదాయ మార్గాల గురించి ఆలోచించడం మొదలు పెట్టింది శ్రీదేవి.