వాస్తవాధీన రేఖ వెంబడి శాంతియుత వాతావరణాన్ని కాపాడుకోవడం భారత్-చైనాల మధ్య ధ్వైపాక్షిక బంధానికి మూలమన్నారు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ. ఇరుదేశాల మధ్య కుదిరిన పరస్పర అంగీకారం మేరకు తూర్పు లద్దాఖ్ సరిహద్దులో బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేసే విషయంలో చైనా చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
భారత్-చైనా మధ్య మరోసారి దౌత్యపరమైన చర్చలు జరుగుతాయని, తేదీలు త్వరలోనే ఖరారు చేస్తామని ఆన్లైన్ మీడియా సమావేశంలో వెల్లడించారు శ్రీవాస్తవ. సరిహద్దులో సాధారణ పరిస్థితులు తిరిగి తీసుకొచ్చి, ఉద్రిక్తతలు తగ్గించేలా చైనా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.