తెలంగాణ

telangana

By

Published : Sep 21, 2019, 7:01 AM IST

Updated : Oct 1, 2019, 10:02 AM IST

ETV Bharat / bharat

గాంధీ 150: 'ఆరోగ్యభారత్'​ కోసం బాపూ ఏం చెప్పారు?

మహాత్మా గాంధీ పేరు వినగానే స్వతంత్ర సంగ్రామం, సత్యాగ్రహం, తెల్లవాళ్లను అహింసతో తరిమికొట్టిన ఉద్యమాలే గుర్తొస్తాయి. అయితే ఆరోగ్యం, ఫిట్​నెస్​ విషయాల్లో గాంధీని మించిన ప్రచారకర్త వేరొకరు లేరు. ఎటువంటి రోగాలు లేకుండా జీవితాన్ని గడిపేందుకు బాపూజీ ఇచ్చిన సూచనలు.. ఆరోగ్య భవితకు మార్గాలు.

గాంధీ 150: 'ఆరోగ్యభారత్'​ కోసం బాపూ ఏం చెప్పారు?

"కాలుష్య వాతావరణంలో జీవించడమంటే.. రోగాలతో జీవించడమే. వ్యాధికి చికిత్స కంటే నివారణే ముఖ్యం." ఇవి మహాత్మా గాంధీ అన్న మాటలు. ఈ మాటల లోతును గమనిస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. పచ్చనైన పల్లె సంస్కృతి నుంచి పట్టణీకరణ, నగరీకరణ పేరుతో కాలుష్య కాసారాల్లోకి ప్రపంచం జారిపోతున్న వైనాన్ని ఈ మాటలు గుర్తుచేస్తాయి. శారీరక వ్యాయామానికి కాకపోతే కాళ్లు చేతులు ఉన్నది దేనికంటూ బాపూ నవ్వుతూ చెబుతుంటారు.

డాక్టర్​ అవుదామనుకొని...

18 ఏళ్ల వయసులో యూకేకి వెళ్లి వైద్యశాస్త్రంలో డిగ్రీ చేద్దామనుకున్నారు గాంధీ. అయితే అనాటమీ (శారీరకశాస్త్రం) చదివేందుకు శవాలకు పరీక్షలు చేయాల్సి వస్తుందని.. వారి కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పడం వల్ల అటు వెళ్లలేకపోయారు బాపూ. కానీ ఆరోగ్యం, వైద్యశాస్త్రంపై ఆయనకున్న మక్కువ మాత్రం పోలేదు.

సబర్మతీ ఆశ్రమంలో...

సబర్మతీ ఆశ్రమంలో అస్థిపంజరం చిత్రాన్ని ఏర్పాటు చేసి ఆశ్రమవాసులకు శరీర అవయవాలపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నించేవారు బాపూజీ. ఔషధాల రసాయనికత, వాటి ప్రభావంపై గాంధీజీకి స్పష్టమైన అవగాహన ఉండేది. శాకాహార అలవాట్లపైనా ఆయన కచ్చితంగా ఉండేవారు. పశువుల నుంచి వెలువడే ఎలాంటి ఉత్పత్తులను తీసుకోకుండా (పాలు కూడా) 7 ఏళ్ల పాటు గడిపారు. అయితే గేదె పాలు కాకుండా మేక పాలను తీసుకునేవారు.

సేవాగ్రామ్​ వాసుల వైద్య చికిత్స, ఆహార నియమాలు, వ్యాయామం, పథ్యం ఇలా అన్నింటినీ దగ్గరుండి చూసుకునేవారు. కుష్ఠువ్యాధి కారణంగా ఓ సంస్కృత పండితుణ్ని ఆశ్రమం నుంచి పంపించేందుకు నిరాకరించారు బాపూజీ. ఆయనకు ప్రత్యేక వసతి కల్పించి.. తానే స్వయంగా వెళ్లి ఆయన ఆరోగ్య స్థితిని సమీక్షించేవారు.

నడకే ఉత్తమం...

స్వతంత్ర సంగ్రామంలో బాపూతో పాటు యువకులు, వృద్ధులు ఇలా వయసుతో సంబంధం లేకుండా అందరూ కలిసి వచ్చారు. సాధారణంగా గాంధీ నడిచినంత వేగంగా యువకులు కూడా నడవలేకపోయేవారు. దండియాత్రలో గాంధీ నడిచిన తీరు బ్రిటిష్​ వారినే విస్మయానికి గురిచేసింది.

పంచభూతాలైన.. నేల, గాలి, నీరు, నిప్పు, ఆకాశం.. మనిషి ఆరోగ్యంపై విశేషమైన ప్రభావం చూపిస్తాయని గాంధీ చెప్పేవారు. 1940-42 మధ్యకాలంలో ఎరవాడ జైలులో గాంధీ ఉన్న సమయంలో ఆరోగ్యంపై పలు రచనలు చేశారు. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాయామం.. ముఖ్యంగా కాలినడక అందరికీ చాలా మంచిదని వివరించారు.

తొందరగా నిద్రపోయి.. తొందరగా లేవడం మంచి ఆరోగ్యానికి ముఖ్యమైన విషయమని తెలిపారు. శరీర అంతర్గత వ్యవస్థ చురుగ్గా పనిచేయడానికి ఇలా తప్పక చేయాలని సూచించారు.

మానసిక ఆరోగ్యం...

శారీరక ఆరోగ్యంపై గాంధీ ఎంతగాదృష్టి పెట్టారో అదే రీతిలో మానసిక ఆరోగ్యంపైనా స్పష్టమైన అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు. మౌనంగా ఉండటం, పొగాకు, మద్యానికి దూరంగా ఉండటం, బ్రహ్మచర్యం పాటించడం మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తాయని స్పష్టం చేశారు. మానసిక ఆరోగ్యానికి ధ్యానం అత్యంత యోగ్యమని గాంధీ తెలిపారు. ధ్యానంతో వైద్యశాస్త్రం వల్ల నయం కాని రోగాలు కూడా నయమవుతాయని నమ్మేవారు.. అందరికీ చెప్పేవారు.

పళ్లు, కూరగాయలు...

రోజువారీ ఆహారంలో పళ్లు, కూరగాయలు తప్పక ఉండాలనేవారు బాపూ. నూనె, వేపుళ్లను తినకపోవడం మంచిదనేవారు. ఇలా పక్కా ప్రణాళికతో ఆహారపు నియమాలు ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని స్పష్టం చేశారు.

వ్యతిరేకి..

ప్రజలు మలవిసర్జన కోసం బహిర్భూమికి వెళ్లడాన్ని గాంధీ వ్యతిరేకించేవారు. మరుగుదొడ్లను నిర్మించుకోవాలని సూచించేవారు. స్వచ్ఛతపై గాంధీకి స్పష్టమైన అవగాహన ఉండేది.

మద్యాన్ని విడనాడితేనే...

దేశంలో ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలంటే మద్యాన్ని విడనాడాలని గాంధీ ఆ రోజుల్లోనే చెప్పారు. మద్యపానం వల్ల మనిషిలో ప్రవృత్తి పుడుతుందన్నారు. దీనివల్ల కుటుంబం, సమాజ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపవాసదీక్ష...

మానవుడు జీవితంలో ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లు, ఉపవాసం ముఖ్యపాత్ర పోషిస్తాయని బాపూజీ చెప్పేవారు. ఆధిపత్యం, అహంకారం, వివక్షలపై పోరాటానికి ప్రపంచానికి గాంధీ చూపిన మార్గం సత్యాగ్రహం, ఉపవాసం. ఈ రెండు ఆయుధాలతో గాంధీ ఎన్నో విజయాలు అందుకున్నారు. బాపూజీని ప్రేరణగా తీసుకొని ఎందరో ఇదే మార్గంలో ఊహించని విజయాలు అందుకున్నారు.

నిజానికి ఉపవాసదీక్షలు భారతీయ సంస్కృతిలో భాగమేనని గాంధీ చెప్పేవారు. అప్పుడప్పుడూ ఉపవాసం ఉండటం మంచిదని వైద్యులు కూడా చెబుతుంటారు.

ఆరోగ్యంపై గాంధీకి ఉన్న అవగాహన, ఆనందమయ జీవితానికి ఆయన చెప్పిన సూచనలు... అందరికీ మార్గదర్శకాలు.. 'ఆరోగ్య భారత్'​ను అందుకునేందుకు సోపానాలు.

(రచయిత- డా.కాళ్లకూరి శైలజ, అసోసియేట్​ ఫ్రొఫెసర్, రంగరాయ ప్రభుత్వ వైద్యకళాశాల, కాకినాడ)​

Last Updated : Oct 1, 2019, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details