తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సత్యాన్వేషి, దీక్షాదక్షుడు, జగత్​ ప్రేమికుడు.. మహాత్ముడు - సత్యం, అహింస గాంధీ ఆయుధాలు

ఆయన ఆలోచన.. భావితరాలకు తారకమంత్రం. ఆయన భావజాలం.. ప్రపంచనేతలకు మార్గదర్శకం. ఆయన నడిచిన బాట... ప్రపంచానికి శాంతి పూతోట. సత్యంలో దైవాన్ని, సంగ్రామంలో స్వరాజ్యాన్ని, బలహీనతలో బలాన్ని శోధించి.. సాధించిన మహాత్ముడు బాపూజీ. ఆదర్శం.. అనుసరణీయం.. ప్రశంసనీయం.. ఆయన మార్గం. సత్యం అహింసలే ఆయుధాలుగా స్వేచ్ఛాసమరంలోకి దూకిన శాంతియోధుడు.. మహాత్ముడు.

సత్యాన్వేషి, దీక్షాదక్షుడు, జగత్​ ప్రేమికుడు.. మహాత్ముడు

By

Published : Oct 1, 2019, 5:01 AM IST

Updated : Oct 2, 2019, 5:00 PM IST

శాంతి, సత్యం, అహింసలనే ఆయుధాలుగా రవి అస్తమించని సామ్ర్యాజ్యాన్ని పునాదులతో సహా పెకలించారు పూజ్య బాపూ. బానిస సంకెళ్లు తెంచేందుకు కోట్లాది మందిని ఏక తాటిపై నడిపి.. జాతివివక్షకు వ్యతిరేకంగా నినదించిన ఎన్నో ఉద్యమగళాలకు... స్ఫూర్తిగా నిలిచారు. క్రూరమైన అణచివేతలకు వ్యతిరేకంగా ఆయన నడిపిన సత్యాగ్రహం... అనంతర కాలంలో చెలరేగిన అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు... ఊపిరిలూదింది. మతవిద్వేషాలు, ఉగ్రవాదాలతో సతమవుతూ శాంతి, సామరస్యాన్ని వెతుకుతున్న ప్రస్తుత ప్రపంచానికి... సరికొత్త దిశానిర్దేశం చేస్తోంది.

అనుక్షణం భయపడుతూ జీవించడమంటే.. ఎప్పుడో ఒక్కసారి రావాల్సిన మరణాన్ని రోజూ ఆహ్వానించడమే. దానికన్నా ఒక్కసారి మృత్యు ఒడిలోకి చేరడం మేలు అంటారు. సృష్టి అనివార్యతలైన జనన, మరణాల్లో కేవలం ఒకదానిపైనే మమకారం పెంచుకునే వారు కోకొల్లలు. ఒక వ్యక్తిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన వారు అమర ప్రేమికుడైతే... జగత్తునే తన కుటుంబంగా భావించి, ప్రతి జీవరాశిలోనూ ప్రేమ పాశాన్ని వెతికిన వ్యక్తిని ఏమంటారు? అలా మృత్యువునూ ప్రేమించిన జగత్‌ప్రేమికుడు.. మహాత్ముడు.

స్వాతంత్ర్య సాధనకు సాయుధపోరాటమే మార్గమనే స్థాయికి విసిగి వేసారిన రోజులవి. అలాంటి సమయంలో.... సొంతగడ్డపై అడుగుపెట్టిన ఓ బక్క పల్చని మనిషి.. పరిస్థితులు సమూలంగా మార్చి మహాత్ముడిగా మారతాడని అప్పుడు ఎవరూ అనుకుని ఉండరు. కానీ ఆయనొచ్చారు. ప్రజల చేతుల్లో ఉన్న కత్తులను, తుపాకులను వారికి తెలియకుండానే తీసేసి.. వాటి స్థానే 2 కొత్త ఆయుధాలు అందించారు. అవే.. సత్యం, అహింస.

మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ! యావత్‌భారతీయులు గుండెల్లో ఎప్పటికీ... అమరం ఈ జ్ఞాపకం. ఆయన చూపిన మార్గం భారతదేశానికే కాదు.. యావత్‌ప్రపంచానికి ఒక వెలుగుబాట అయింది. స్వార్థం కన్నా త్యాగం, కోపం కన్నా శాంతం, శిక్ష కన్నా క్షమాగుణాలే అమోఘం అని నమ్మటమే కాదు... నిరూపించి చూపి మహాత్ముడిగా నిలిచిపోయారు.

Last Updated : Oct 2, 2019, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details