మహారాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చే అంశంపై కాంగ్రెస్ నుంచి అస్పష్ట వైఖరి ఎదురవడం వల్ల శివసేనకు చుక్కెదురైంది. దీని వల్ల గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఇచ్చిన గడువులోగా అధికారం చేజిక్కించుకోవడంలో సేన విఫలమైంది. ప్రభుత్వ స్థాపనకు శివసేన 48 గంటల సమయం కోరగా అందుకు గవర్నర్ తిరస్కరించారు. అనంతరం ఎన్నికల్లో మూడో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్సీపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమిచ్చారు.
తొలుత ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా భాజపాను (105స్థానాలు) గవర్నర్ ఆహ్వానించారు. 50-50 ఫార్ములాపై మిత్రపక్షం శివసేనతో విభేదాలు ఎదురవడం వల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని చేతులెత్తేసింది కాషాయ దళం. అనంతరం రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేన (56సీట్లు)ను గవర్నర్ ఆహ్వానించారు. సోమవారం రాత్రి 7.30 గంటల్లోగా ప్రభుత్వం ఏర్పాటుకు సమ్మతిని తెలియజేయాలని సూచించారు. శివసేన కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమవ్వడం వల్ల ఎన్సీపీని అహ్వానించారు. నేటి రాత్రి 8.30 గంటల వరకు గడువు విధించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మిత్రపక్షం కాంగ్రెస్(44సీట్లు) మద్దతున్నప్పటికీ.. మెజారిటీ సరిపోదు. శివసేన సహకారం ఆ పార్టీకి తప్పనిసరి. మరి ఇప్పుడు ఎన్సీపీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
సేనకు హస్తం షాక్..
సోమవారం రాత్రి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గవర్నర్ గడువు ముగింపునకు కొంత సమయం ముందు.. కాంగ్రెస్-ఎన్సీపీ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వార్తాలొచ్చాయి. శివసేనకు చెందిన సామ్నా పత్రిక ఆన్లైన్ ఎడిషన్ కూడా దీన్ని ధ్రువీకరించింది. అయితే సేనకు మద్దతిచ్చే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకలేదని.. మరిన్ని చర్చలు అవసరమని కాంగ్రెస్ ప్రకటించింది. దీని వల్ల శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.
నేడు కాంగ్రెస్ సమావేశం...
మహారాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ కోర్‌కమిటీ నేడు మరోసారి సమావేశం కానుంది. ఎన్సీపీకి మద్దతిచ్చే అంశం సహా.. పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు సీనియర్ నేతలు. మహారాష్ట్ర రాజకీయాలపై సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెండు సార్లు సమావేశమైంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న మరో దఫా సమావేశంలో కాంగ్రెస్ వైఖరిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.