తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయికి 'మహా' విపత్తు.. ఎందుకిలా? - mumbai hotspot

కరోనా మహమ్మారి ఇప్పుడు మహారాష్ట్రను బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయి వణికిపోతోంది. దేశంలో ఈ రాష్ట్రంలోనే కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్నాయి. వైరస్‌ వ్యాప్తి, మరణాల రేటు రెండూ ఎక్కువే. ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు ఏర్పడింది?

maharastra effected badly with corona in india
మహా గుబులు పుట్టిస్తోన్న కరోనా!

By

Published : Apr 18, 2020, 8:03 AM IST

Updated : Apr 18, 2020, 9:42 AM IST

కరోనా వైరస్​ మహారాష్ట్రను వణికిస్తోంది​. ఆసియాలోనే అతి పెద్దదైన ముంబయి మురికివాడ ధారవిలోనూ కేసులు నమోదవడం అధికారుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత కిక్కిరిసిన ప్రాంతం కావడం వారి ఆందోళనకు ప్రధాన కారణం. కరోనా కేసుల తొలిరోజుల్లో కాస్త ఫర్వాలేదన్నట్లుగా ఉన్న మహారాష్ట్ర.. అనూహ్యంగా ప్రథమ స్థానానికి ఎందుకు వెళ్లింది? అత్యధిక మరణాల రేటుతో ముంబయి ఎందుకు వణికిపోతోంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇందులో ప్రజల పాత్ర ఏమిటి? అనే అంశాలపై 'ఈటీవీ-భారత్‌' అందిస్తున్న ప్రత్యేక కథనం...

హాట్‌స్పాట్‌లుగా ముంబయి, పుణె

మహారాష్ట్రలో 36 జిల్లాలు ఉండగా 5 జిల్లాల్లో(నాగ్‌పుర్‌, ఔరంగాబాద్‌, నాసిక్‌, అహ్మద్‌నగర్‌, సాంగ్లి)నే 20 కంటే అధిక కేసులు నమోదయ్యాయి. ఈ నగరాల్లోనే వైరస్‌ ఉనికి ఎక్కువగా ఉంది. ముంబయి, పుణె ప్రధాన హాట్‌స్పాట్‌లుగా మారాయి. మిగిలిన గ్రామీణ ప్రాంతాల్లో కట్టడి బాగానే జరిగింది. వార్దా, గడ్చిరోలి, చంద్రపుర్‌ జిల్లాల్లో ఒక్కకేసూ నమోదుకాలేదు.

ఎందుకీ వణుకు?

ఆర్థిక రాజధాని ముంబయికి(జనాభా 1.40 కోట్లు), ఐటీ హబ్‌గా పేరొందిన పుణె(75 లక్షలు)కు జాతీయ, అంతర్జాతీయ సంబంధాలు అధికం. రోజూ వచ్చీపోయే అంతర్జాతీయ ప్రయాణికులతో ఈ నగరాలు కిటకిటలాడుతాయి. రెండింటి మధ్య 150 కి.మీ. దూరమున్నా... గట్టి వ్యాపార బంధాలతో పెనవేసుకున్నాయి. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌ హైవేలో రోజూ 35 వేల కార్లు తిరగడమే ఇందుకు ఉదాహరణ. ఈ కారణంగా వైరస్‌ ఇటు నుంచి అటు, అటునుంచి ఇటు ప్రయాణించిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ముంబయిలో లోకల్‌ రైళ్ల టిక్కెట్ల ధర చాలా తక్కువ కావడం వల్ల వాటిలో నిత్యం లక్షల మంది ప్రయాణిస్తారు. దీనివల్ల వైరస్‌ వ్యాప్తి చాలా సులువుగా జరుగుతుందని అంతా భయపడ్డారు. వీటిని నిలిపేస్తే ప్రజాజీవనం స్తంభించి పోయే ప్రమాదం ఉండటం వల్ల తాత్సారం జరిగింది. అందుకే మెజారిటీ కొవిడ్‌ కేసులు ఇక్కడ నమోదయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది?

వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో గట్టి చర్యలే తీసుకుంది. ప్రజల రాకపోకలపై దేశంలోనే మొట్టమొదట ఆంక్షలు విధించింది. తబ్లీగీ జమాత్‌ సమావేశం ముంబయి సమీపంలో నిర్వహించుకోవడానికి పెట్టుకున్న అర్జీని సైతం తిరస్కరించింది. అదే సమావేశం దిల్లీకి బదిలీ అయి.. ఇప్పుడదే దేశంలో ఎక్కువ కేసులకు కారణమయ్యింది.

ప్రజల పాత్రా ఉంది

లాక్‌డౌన్‌ ప్రకటించిన మూడు రోజుల తర్వాత కూడా ఈ రెండు నగరాల్లోని ప్రజలు రోడ్లపైకి యథేచ్ఛగా వచ్చారు. కార్లు, ద్విచక్ర వాహనాలతో మార్కెట్లలో కొనుగోళ్లు చేశారు. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ను కట్టడి చేయొచ్చనే అపోహతో ప్రైవేటు కార్యాలయాలకు వస్తూనే ఉన్నారు. ఫలితంగా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.

లాక్‌డౌన్‌ నీరుగారిందిలా..

లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసరాల దుకాణాలను 24 గంటలూ తెరిచి ఉంచడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అందువల్ల ప్రజలు గుమిగూడటం తగ్గలేదు. వ్యవసాయ, అనుబంధ మార్కెట్ల విషయంలోనూ తప్పటడుగు పడింది. దేశంలోనే అతి పెద్దదైన నవీ ముంబయి వ్యవసాయ మార్కెట్‌ను రెండంటే రెండు రోజులే మూసేసి, మళ్లీ తెరిచారు. తర్వాత ఆంక్షలు విధించారు. బాధితులను గుర్తించడానికి పరీక్షలు చేయడంలోనూ ఇంకా దూకుడుగా ఉంటే బాగుండేదనేది నిపుణుల అభిప్రాయం.

మొదలైన విశ్లేషణ

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో మరణాలు 6.8% ఉండటం వల్ల ప్రభుత్వం ఉలిక్కిపడింది. వెంటనే ఐదుగురు సభ్యులతో కమిటీని వేసింది. నమోదవుతున్న ప్రతి మరణం వెనుక కారణాలను విశ్లేషించాలని ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని కొవిడ్‌ ఆసుపత్రులకు నమూనా ఫార్మాట్లను పంపింది. మరణాలను ఆపడానికి ఏమేం చేయాలనే సూచనలూ చేయాలంది. మరణాలను తగ్గించడానికి ప్రజలు తమతో సహకరించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కోరుతున్నారు.

అది... ఆశలు తుంచేసే యుద్ధభూమి

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా ప్రసిద్ధి చెందిన ధారవి... బాగా కుక్కిన టపాసుల డబ్బాలాంటిది. ఒక్క నిప్పురవ్వ పడినా అంతా బుగ్గి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కేవలం 2.5 చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న ప్రాంతంలోనే ఏకంగా 10 లక్షల మంది నివాసం ఉంటున్నారు. కేవలం 100 చదరపు అడుగుల విస్తీర్ణమున్న గదిలో గరిష్ఠంగా 8-15 మంది నివసిస్తారు. ఇలాంటి ఆవాస ప్రాంతం ఈ భూగోళంపై ఎక్కడా కనిపించదంటే ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. 80 శాతం ఇళ్లకు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండవు. అందరికీ ప్రజా మరుగుదొడ్లే దిక్కు. ఒక్కోదాన్ని రోజుకు 250 మంది వరకు ఉపయోగించుకుంటారు.

తొలి కేసుతో ఉలిక్కిపాటు

  • మార్చి 23న ధారవిలో తొలి కొవిడ్‌ కేసు, ఏప్రిల్‌ 1న తొలి కొవిడ్‌ మరణం నమోదైంది. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
  • ముంబయి నగరపాలక సంస్థ నుంచి 274 మంది సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య పర్యవేక్షకులు, 200 మంది సిబ్బందితో కూడిన ఆరు వైద్య బృందాలు ధారవిలో పనిచేస్తున్నాయి.
  • స్థానిక రాజీవ్‌గాంధీ క్రీడా ప్రాంగణంలో 300 పడకలతో ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. కొద్ది లక్షణాలున్న వారిని రాజీవ్‌గాంధీ క్రీడా ప్రాంగణానికి, తీవ్రస్థాయిలో ఉన్న వారిని లీజుకు తీసుకున్న ప్రైవేటు ఆసుపత్రికి పంపిస్తున్నారు.
  • బలిగానగర్‌, వైభవ్‌ అపార్ట్‌మెంట్స్‌, ముకుంద్‌నగర్‌, మదీనానగర్‌, ధన్‌వాడ చావల్‌ ప్రాంతాలకు చెందిన 8 వేల మందిని క్వారంటైన్‌ చేశారు.
  • రోజూ బాధితుల ఇళ్లు, భవనాలు, వీధులు, మురుగు కాలువలను రసాయన ద్రావణాలతో శుద్ధి చేస్తున్నారు.
  • ఇక్కడ భౌతిక దూరం పాటించడం అసంభవం కావడం వల్ల బాధితులుండే ప్రాంతాలనే ఐసోలేట్‌ చేశారు. వారిళ్లకు నిత్యావసరాలతోపాటు వారిలో ముందు జాగ్రత్త చర్యగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు సైతం పంపిణీ చేస్తున్నారు.
  • చాలామంది తమ ఇళ్ల బయట నిద్రిస్తుండటం, సామూహిక మరుగుదొడ్లను వాడుతుండటం వల్ల సమస్యను ఎదుర్కోవడం సవాల్‌గా మారింది.

ఇరుకింట్లోనూ తబ్లీగీ సభ్యులకు ఆశ్రయం

వైరస్‌ సోకిన తొలి బాధితుడు ధారవిలోని దాదాపు 350-400 చ.అ. విస్తీర్ణమున్న ఇంట్లో 8 మందితో నివాసం ఉండేవాడు. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 10 మంది తబ్లీగీ జమాత్‌ సభ్యులకు ఆశ్రయమిచ్చాడు. వారు వెళ్లిపోయిన తర్వాత అతనిలో కరోనా బయటపడగా 74 మందిని క్వారంటైన్‌ చేశారు.

కాస్త ఊరట

ధారవిలో కేసుల వ్యాప్తిలో మందగమనం ఒక్కటే ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం కేసులు నమోదైన బాలిగనగర్‌, డైమండ్‌నగర్‌, సాహునగర్‌లు... మిగతా ధారవితో పోలిస్తే కొంత మెరుగైన స్థితిలోనే ఉంటాయి. వీటిల్లో రెండు పడకగదుల ఇళ్లు, చిన్న అపార్టుమెంట్లలో వ్యాపారులు, ఉద్యోగులు, ఆర్థికంగా కాస్త మెరుగైన స్థితిలో ఉన్న వారే ఉంటారు. మొత్తంగా శుక్రవారం సాయంత్రానికి 101 కేసులు, 10 మరణాలు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు.

అయితే... వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతి చ.కి.మీ.కి 4 లక్షల మంది నివసిస్తున్న ఈ ప్రాంతం అత్యంత క్లిష్టమైన యుద్ధభూమి లాంటిదే.

ఇదీ చదవండి:మరో వ్యాక్సిన్‌ను పరీక్షిస్తున్న భారత శాస్త్రవేత్తలు

Last Updated : Apr 18, 2020, 9:42 AM IST

ABOUT THE AUTHOR

...view details