తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో భాజపాకు నిజంగా నష్టం జరిగిందా..? - మహారాష్ట్రలో పుంజుకున్న కాంగ్రెస్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చింది. 2014లో 122 చోట్ల నెగ్గిన భాజపా ఈ సారి 105 స్థానాలకే పరిమితమైంది. అయినప్పటికీ శివసేనతో కలిసి కూటమిగా 161 స్థానాలతో సాధారణ మెజార్టీ సాధించింది. ఈ రెండూ కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖరారైంది. అయితే.. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను తలకిందులు చేసిన ఈ ఫలితాలతో భాజపాకు ఏమైనా నష్టం జరిగిందా.. సీట్ల లెక్కలు, ఓట్ల శాతాల సంగతేంటి?

'మహా'లో భాజపాకు నిజంగా నష్టం జరిగిందా..?

By

Published : Oct 25, 2019, 5:17 AM IST

Updated : Oct 25, 2019, 7:34 AM IST

'మూడింట రెండొంతుల స్థానాలు అధికార కూటమికే'... మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిన వెంటనే పలు ఎగ్జిట్​ పోల్స్​ వేసిన అంచనా. ఈ లెక్కన భాజపా-శివసేన కూటమికి దాదాపు 190 పైచిలుకు స్థానాలు దక్కాలి. భాజపా-సేన కూడా 220 ప్లస్ గెలుస్తామన్నాయి. అయితే... గెలిచింది మాత్రం 161 స్థానాల్లోనే.

ఫలితాల అనంతరం మహారాష్ట్రలో భాజపాకు నష్టం కలిగిందా?.. స్థానాలు తగ్గే సరికి జోరుకు అడ్డుకట్ట పడిందా?... అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంచనాల్లేని దశనుంచి కాంగ్రెస్​-ఎన్సీపీలు గట్టి పోటీనే ఇచ్చాయి. కానీ... ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు నెగ్గలేకపోయాయి.

పెరిగిన స్ట్రైక్​రేట్​...

భాజపా జోరు తగ్గిందన్న అనుమానాల నడుమ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్​ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సారి 2014లో కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేసి మంచి ఫలితాల్ని సాధించామని చెప్పుకొచ్చారు. దీనినీ అంగీకరించకతప్పదు.

''2014 ఎన్నికల్లో 260 స్థానాల్లో పోటీ చేసి 122 చోట్ల నెగ్గాం. ఈ సారి బరిలోకి దిగిన 164 స్థానాల్లో(భాజపా 150, మిత్రపక్షాలు 14) 105 గెలిచి మంచి ఫలితాన్నే సాధించాం. 2014లో 47గా ఉన్న మా స్ట్రైక్​ రేట్... ఈ సారి 70కి చేరింది.
​2014లో మేం 28 శాతం ఓట్లు సాధిస్తే...ఈ సారి పోటీ చేసిన 164 స్థానాల్లోనే 26 నుంచి 26.6 శాతం ఓట్లు పొందాం.''
- దేవేంద్ర ఫడణవీస్​, మహారాష్ట్ర ముఖ్యమంత్రి

2014లో లెక్కలు వేరే...

2014 శాసనసభ ఎన్నికల్లో భాజపా, శివసేన వేర్వేరుగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో కాషాయ పార్టీ 122 స్థానాల్లో నెగ్గి అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 63 స్థానాలతో రెండో స్థానం దక్కించుకుంది. కాంగ్రెస్​, ఎన్సీపీలు 42, 41 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఎన్నికల అనంతరం.. భాజపా-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

ఈ సారి పొత్తుగా బరిలోకి దిగిన అధికార కూటమి 161 స్థానాలే దక్కించుకుంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు విజయంతో ప్రభంజనం సృష్టించిన అనంతరం.. జరిగిన ఎన్నికలు అయినందున మంచి ఫలితాల్నే ఆశించింది భాజపా. కానీ... ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయిందనే చెప్పాలి.

ఓడిన మంత్రులు....

మహారాష్ట్రలో భాజపా జోరు తగ్గడానికి రెబల్స్​ ఓ కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 288 నియోజకవర్గాల్లో 75 చోట్ల తిరుగుబాటు నేతలు బరిలోకి దిగితే.. అందులో 61 మంది భాజపా, శివసేన లక్ష్యంగా పోటీ చేసినవారే. వీరే భాజపాకు నష్టం చేకూర్చారని నమ్ముతోంది అధిష్ఠానం.

ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కొంత బయటపడినట్లే కనిపిస్తోంది. బరిలోకి దిగిన ఏడుగురు మంత్రులు, డిప్యూటీ స్పీకర్​ పరాజయం పాలయ్యారు. శివసేన నేత, ఉప సభాపతి విజయ్​... ఎన్సీపీ అభ్యర్థి చేతిలో ఓడారు. పర్లీ నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే అనూహ్య ఓటమి చవిచూశారు. ఇక్కడ మోదీ, అమిత్​ షా ఎన్నికల ప్రచారాలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. ఇంకా జల సంరక్షణ మంత్రి, వ్యవసాయ మంత్రి, ఇతర సహాయ మంత్రులకూ ఓటమి తప్పలేదు.

ఇదీ చూడండి:బిహార్​లో ఖాతా తెరిచిన అసదుద్దీన్​ పార్టీ

Last Updated : Oct 25, 2019, 7:34 AM IST

ABOUT THE AUTHOR

...view details