తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేపే ఠాక్రే ప్రమాణం.. అతిరథమహారథులకు ఆహ్వానం - maharashtra-will-have-a-chief-minister-from-the-shiv-sena-after-20-years

మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహారాష్ట్ర వికాస్ అఘాడీ సర్కార్ రేపు కొలువుతీరనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రిగా ఉద్దవ్‌ఠాక్రే ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ముంబయిలోని శివాజీపార్క్‌లో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ సహా మహారాష్ట్రలో ఆత్మహత్యలు చేసుకున్న 400మంది రైతు కుటుంబాలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మరోవైపు కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య పదవుల పంపకం కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఉద్దవ్‌ఠాక్రే నేతృత్వంలోని మంత్రివర్గంలో శివసేనకు 16, ఎన్​సీపీకి 15, కాంగ్రెస్‌కు 13 మంత్రి పదవులు, స్పీకర్‌ పదవి దక్కనున్నట్లు సమాచారం.

maharashtra-will-have-a-chief-minister-from-the-shiv-sena-after-20-years
'మహా' ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు-కొలిక్కి వచ్చిన పదవుల పంపకాలు

By

Published : Nov 27, 2019, 6:32 PM IST

మహారాష్ట్రలో శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్‌తో కూడిన మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ సర్కార్‌ ఏర్పాటుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్దవ్‌ఠాక్రే.. గురువారం ప్రమాణం చేయనున్నారు. గురువారం సాయంత్రం 6:40 గంటలకు దాదర్‌లోని శివాజి పార్క్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్‌ఠాక్రే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

రైతు కుటుంబాలకు ఆహ్వానం

ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారానికి శివాజీ పార్కులో ముమ్మురంగా ఏర్పాట్లు సాగుతుండగా.... ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మహారాష్ట్ర నవ నిర్మాణసేన అధినేత రాజ్‌ఠాక్రేలను ఆహ్వానించినట్టు శివసేన ప్రకటించింది. మహారాష్ట్రలోని.. అన్ని జిల్లాలల్లో ఆత్మహత్యలు చేసుకున్న 400 మంది రైతు కుటుంబాలను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినట్టు శివసేన తెలిపింది. అటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బంగాల్‌, దిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రివాల్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌లను ఆహ్వానించినట్లు మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ నేతలు తెలిపారు.

ఉద్ధవ్​కు గవర్నర్​ లేఖ

ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఉద్దవ్‌ఠాక్రే.... గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీతో ఉదయం సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత ఉద్దవ్‌కు లేఖ రాసిన గవర్నర్‌ గురువారం నిర్ణయించిన సమయానికి ప్రమాణ స్వీకారం చేయించనున్నట్టు తెలిపారు. అయితే బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లో శాసనసభ లేదా శాసన మండలికి ఎన్నిక కావాలని, వారంలోపు అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రేకుగవర్నర్‌ సూచించారు.

ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్!

మరోవైపు గురువారం ఠాక్రే ఒక్కరే ప్రమాణం చేస్తారా లేక భాగస్వామ్య పక్షాల నుంచి ఉప ముఖ్యమంత్రులు లేక మంత్రులు ప్రమాణం చేస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. భారతీయ జనతాపార్టీతో కలిసి.. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి... మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలానికి కారణమై... తర్వాత తన పదవికి రాజీనామా చేసిన ఎన్​సీపీ నేత అజిత్‌ పవార్‌ ఇప్పుడు కూటమి తరపున ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతకుముందు ఎన్​సీపీ ఎమ్మెల్యేల సమావేశానికి హాజరయ్యారు అజిత్​ పవార్. పార్టీ నేతలకు దిశానిర్దేశనం చేశారు. శరద్ పవారే తమ నాయకుడని సమావేశంలో అజిత్ పునరుద్ఘాటించినట్లు ఎన్​సీపీ ఎమ్మెల్యేలు వెల్లడించారు.

పదవుల పంపకాలు

మరోవైపు మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ కూటమి భాగస్వామ్య పక్షాలు.. పదవుల పంపకంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా... కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, మల్లిఖార్జున ఖర్గే... ఎన్​సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశమై... మంత్రి పదవులపై చర్చించారు. అనంతరం శరద్‌పవార్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఉద్దవ్‌ఠాక్రేను కలిసి.... కాంగ్రెస్‌, ఎన్​సీపీ నేతల మధ్య జరిగిన భేటీకి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. మొత్తానికి శివసేనకు ముఖ్యమంత్రి పదవి సహా కేబినెట్‌లో 16 బెర్తులు, ఎన్​సీపీకి 15, కాంగ్రెస్‌కు స్పీకర్‌ పదవి సహా 13 మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌కు దక్కే 13 బెర్తుల్లో 9 కేబినెట్‌, 4 సహాయ మంత్రి పదవులు ఉన్నట్టు తెలుస్తోంది. అసవరమైతే... స్పీకర్‌ పదవిని వదులుకునేందుకు కాంగ్రెస్‌ సంసిద్ధత వ్యక్తంచేసినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details