మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అక్కడ చదివే విద్యార్థుల్లో కొంతమందికి హెచ్ఐవీ సోకిందనే నెపంతో వారిని బడి నుంచి వెలివేశారని 'ఇన్ఫాంట్ ఇండియా' స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు దత్తా బార్గజే ఆరోపించారు. సదరు పాఠశాల ఉపాధ్యాయులపై అభియోగాలు మోపుతూ జిల్లా విద్యాధికారులకూ ఫిర్యాదు చేశారాయన. ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, పాలనాధికారులు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి హెచ్ఐవీపై అవగాహన కల్పిస్తున్న తరుణంలో.. ఇలాంటి దుర్ఘటనలు వెలుగుచూడటం బాధాకరమన్నారు బార్గజే.
ప్రధానోపాధ్యాయుని స్పందన..
అయితే.. ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కేఎస్ లాడ్. ఇలాంటి నిందారోపణలు రాష్ట్రాన్ని అగౌరవపరుస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.