జాతీయ స్థాయిలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ విచ్ఛిన్నమై బలహీనపడిందని శివసేన అధికార పత్రిక సామ్నా పత్రిక వ్యాఖ్యానించింది. సేనతో సహా.. భాజపా వ్యతిరేక పార్టీలన్నీ ఓ గొడుగు కిందకు వచ్చి.. ప్రతిపక్షాన్ని బలోపేతం చేయాలని పేర్కొంది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనల పట్ల కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తూ.. అసమర్థతను చాటుతోందని సామ్నా పేర్కొంది. కేంద్రం అలా చేయడానికి కారణం.. బలమైన ప్రతిపక్షం లేకపోవడమేనని ఆరోపించింది. అసమర్థమైన పాలన వల్ల ప్రజాస్వామ్య విచ్ఛిన్నానికి దారితీస్తోందని రాసుకొచ్చింది. కాంగ్రెస్.. కేంద్రాన్ని విమర్శించే ముందు తన పార్టీ నాయకత్వ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక్కరే కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నా.. అందులోనూ లోపాలున్నాయని సామ్నా పత్రిక వెల్లడించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్(యూపీఏ) ప్రస్తుత పరిస్థితి ఓ ఎన్జీఓగా మారిందని విమర్శించింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, బంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఒంటిరి పోరాటం సాగిస్తున్న వేళ.. ప్రతిపక్ష పార్టీ వారికి అండగా ఉండాలంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), శివసేన, అకాలీదళ్, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)-అఖిలేష్ యాదవ్, వైఎస్సార్ సీపీ-జగన్మోహన్ రెడ్డి, తెలంగాణకు చెందిన కేసీఆర్, ఒడిశా-నవీన్ పట్నాయక్ మొదలగు వారంతా యూపీఎకు వ్యతిరేకంగా ఉన్నారు. వీరంతా యూపీఏలో చేరితే తప్ప.. ప్రతిపక్షం బలపడదని తన సామ్నా రాసుకొచ్చింది.
ఇదీ చదవండి:'అన్నదాతల ఆవేదనను కేంద్రం వినాల్సిందే'