దేశంలోనే కరోనా కేసులతో తొలిస్థానంలో ఉంది మహారాష్ట్ర. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 56 వేలు దాటింది. రోజురోజుకూ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో.. చికిత్స అందించేందుకు ముంబయి సహా ఇతర నగరాల్లోని ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడింది. కొవిడ్ బారిన పడిన వారు చికిత్స కోసం సుమారు 10 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
72 వేలకుపైగా ఫిర్యాదులు..
గడిచిన 10 రోజుల్లో ముంబయిలో రోజుకు సుమారు 1500కుపైగా కేసులు నమోదయ్యాయి. పురపాలక సంఘం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ 1916కు సుమారు 72 వేలకుపైగా కాల్స్ వచ్చాయంటే అక్కడి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. అందులో 21 వేల కాల్స్ పడకలు ఏర్పాటు చేయాలని, 11వేల కాల్స్ అంబులెన్స్‌ల కోసం వచ్చాయి. ఆస్పత్రుల్లో పడకలు అందుబాటులో లేక కొన్ని సందర్భాల్లో కరోనా రోగులను సైతం ఇంటి వద్దే ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.