మహారాష్ట్రలో భాజపా అనూహ్యంగా ప్రభుత్వం ఏర్పాటుచేయడంపై ఎన్సీపీ , శివసేన సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా తొలుత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మీడియాతో మాట్లాడుతూ.. శివసేన- కాంగ్రెస్- ఎన్సీపీ నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించామన్నారు. తమకు 170 మంది సభ్యుల బలం ఉందన్నారు.
కొంతమంది స్వతంత్ర ఎమ్మెల్యూలూ మద్దతు తెలిపారన్నారు. అజిత్ పవార్‌ది వ్యక్తిగత నిర్ణయమేననీ.. ఆయన పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్నారు. ఆయన నిర్ణయంతో ఎన్సీపీలో ఎవరూ సంతోషంగా లేరన్నారు. పార్టీ ఫిరాయిస్తే శాసనసభ సభ్యత్వం కూడా కోల్పోతారని ఆయనతో వెళ్లినవాళ్లు గుర్తుంచుకోవాలని పవార్ హెచ్చరించారు. అజిత్‌తో కలిసి వెళ్లినవారిలో 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పారు. నిజమైన ఎన్సీపీ కార్యకర్తలు, నేతలు ఎప్పుడూ భాజపాతో చేతులు కలపరని శరద్ పవార్ స్పష్టంచేశారు.
రాష్ట్రపతి పాలన ఎత్తివేత, రాజ్‌భవన్‌లో దేవేంద్ర ఫడణవీస్ సీఎంగా ప్రమాణస్వీకారోత్సవం గురించి ఈ ఉదయం 6.30 గంటలకు తనకు తెలిసిందని పవార్ వెల్లడించారు.