మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా లేమని భాజపా తేల్చిచెప్పిన నేపథ్యంలో 'మహా' బంతి ఇప్పుడు శివసేన కోర్టులో ఉంది.
గవర్నర్ భగత్ కోశ్యారీ ప్రభుత్వం ఏర్పాటుచేయాలని శివసేనను ఆహ్వానించారు. ఇవాళ సాయంత్రం 7.30లోపు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గడువు విధించారు. ఈ మేరకు రాజ్‌భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
వ్యూహాలకు పదును
సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో శివసేన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత ఉద్ధవ్ ఠాక్రే భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటులో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు
శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో శరద్‌పవార్, సోనియాలతో మంతనాలు చేసేందుకు శివసేన నేత సంజయ్ రౌత్ రంగంలోకి దిగారు. ఇదే పనిపై హుటాహుటిన దిల్లీ వెళ్లారు. కాంగ్రెస్, ఎన్సీపీ నేతలతో భేటీ అయి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరనున్నారు.
భాజపాతో తెగదెంపులు చేసుకోవాల్సిందే..
బలపరీక్షలో మద్దతు తెలపాలంటే.. ఎన్డీఏ కూటమి నుంచిశివసేన పూర్తిగా బయటకు రావాలని ఎన్సీపీ తేల్చిచెప్పింది. అలాగే కేంద్రప్రభుత్వంలోని అన్ని పదవులకూ సేన నాయకులు రాజీనామా చేయాలని పేర్కొంది.