దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాకపోకలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దిల్లీ నుంచి ముంబయికి వచ్చే విమానాలను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే రైళ్ల సేవలను కూడా నిలిపివేయాలని చూస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
అక్టోబర్ 28 నుంచి దిల్లీలో కరోనా కేసుల్లో ఆకస్మిక పెరుగుదల కనిపించింది. నవంబర్ 11న 8వేల మార్కును దాటి ఆందోళనకు గురిచేసింది. అలాగే గడిచిన 24 గంటల్లో 7,500 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ క్రమంలో దిల్లీ ప్రభుత్వం కఠిన నిబంధనలకు ఉపక్రమించింది. వివాహ వేడుకల వంటి శుభకార్యాలకు 50 మందిని మాత్రమే అనుమతించడం, మాస్క్ ధరించని వారికి రూ.2,000 జరిమానా విధించడం వంటి చర్యలకు పూనుకుంది.