మహారాష్ట్ర బుల్దానాలో వింత ఘటన జరిగింది. ఓ ఆవుకు, దూడకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని పోలీసులు ఆదేశించారు. దూడపై యాజమాన్య హక్కుల కోసం గొడవ మొదలవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు.
ఇదీ జరిగింది...
తానాజీ నగర్‌కు చెందిన ప్రదీప్ మోరే, అఫ్రోజ్ బాగ్భన్లు.. మూడేళ్ల దూడపై యాజమాన్య హక్కుల గొడవతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆ దూడ 'నాదంటే నాదంటూ' వాదించుకున్నారు.
ప్రదీప్ మోర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. దూడ తన ఆవుకే పుట్టిందని తెల్చిచెప్పాడు. కొంతమందితో కలిసి బాగ్భన్దూడను బలవంతంగా ట్రక్కులోకి ఎక్కించి తీసుకెళ్లడం తాను చూసినట్లు పేర్కొన్నాడు.
ఎంతకీ సమస్య కొలిక్కి రాకపోవడం వల్ల పోలీసులు ఓ పరీక్ష పెట్టారు. పెంచిన వ్యక్తిని చూస్తే తల్లీ,బిడ్డా పరిగెత్తుకుంటూ వస్తాయని.. ఎవరి దగ్గరికి వెళితే వారిదే అని నిర్ధరించుకోవచ్చని అనుకున్నారు. దూడ మోరేని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లింది. దీంతో ఆవు-దూడ అతనివే అని భావించారు. కానీ అందుకు బాగ్భన్ అంగీకరించకపోవడం వల్ల సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో ఈ సమస్యను శాస్త్రీయంగా డీఎన్ఏ పరీక్షతో తేల్చుకోవాలని సూచించారు పోలీసులు.
ఈ విషయంపై బుల్దానా పశుసంవర్ధక శాఖా అసిస్టెంట్ కమిషనర్ సాలుంఖ.. పోలీసులకు లేఖ రాశారు. ఆవు-దూడలను పంపితే డీఎన్ఏ పరీక్షకు శాంపిల్స్ తీసుకుంటామని పేర్కొన్నారు. స్థానికంగా పరీక్షించే సౌకర్యం లేకపోవడం వల్ల హైదరాబాద్ పంపాల్సి వస్తుందని తెలిపారు. ఐతే ఇది ఖర్చుతో కూడుకున్నదని స్పష్టం చేశారు. అయితే వచ్చే ఫలితంతో అసలు యజమాని ఎవరో తెలుస్తుందన్నారు.
మనుషులపై డీఎన్ఏ పరీక్షలు జరపడం సర్వ సాధారణం. వారి తల్లిదండ్రులను నిర్ధరించేందుకు ఈ పరీక్షలు చేస్తారు. ఇలా జంతువులకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించడం చాలా అరుదు.
ఇదీ చూడండి: 'ప్రపంచానికి ఔషధ కర్మాగారంలా భారత్'