ప్రసవం సమయంలో మృతి చెందిన మహిళ ప్రపంచంలో మహిళలు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. పురుషులకు తక్కువ కాదని నిరూపిస్తున్నారు. కానీ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో.. కొడుకు ఉంటేనే వంశం నిలబడుతుందనే మనస్తత్వం ప్రజల్లో ఇంకా ఉంది. కొడుకు కోసం ఏడోసారి గర్భం దాల్చిన ఓ మహిళ ప్రసవం సమయంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మహారాష్ట్ర హింగోలిలో జరిగింది. ఇప్పటికే ఆమెకు ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. కొడుకు కావాలని...
హింగోలి నగరంలో వ్యవసాయ కూలీలుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సతీశ్ పయీక్రావు, బేబీ దంపతులకు ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. బేబీ ఎప్పుడూ కొడుకు కావాలని ఆశపడుతుండేది. కొడుకు ఉంటేనే వంశం నిలబడుతుందనే విషయాన్ని వెలిబుచ్చేది. భర్త, బంధువులు చెబుతున్నప్పటికీ.. మొండి పట్టుదలతో కొడుకు కోసం కుటుంబ నియంత్రణకు ఒప్పుకోలేదు. ఏడోసారి గర్భం దాల్చింది.
కన్నీరుమున్నీరైన బంధువులు
ఇప్పటికే ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారనే ఆలోచనతో ఎప్పుడు ఒత్తిడిలోనే ఉండేది బేబీ. ఈసారైనా కొడుకు పుడతాడో లేదో అని మానసికంగా బాధపడుతుండేది.
ప్రసవ నొప్పులు వచ్చిన నేపథ్యంలో బంధువులు స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించాలని సూచించారు.
జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చిన కొద్ది సేపటికే బేబీ ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణంతో భర్త, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఎంత చెప్పిన వినకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: యుక్త వయస్సులోనే మత్తుకు బానిసలుగా..!