తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వారసుడి కోసం కన్నయ్యకు కళ్లెం! - సీపీఐ పొత్తు

యువకుడు. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అలాంటి వ్యక్తికి... ప్రత్యర్థుల నుంచి సవాళ్లు ఎదురవడం సహజమే. కానీ... కన్నయ్య కుమార్​కు మాత్రం మిత్రపక్షాల నుంచే ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకలా?

వారసుడి కోసం కన్నయ్యకు కళ్లెం!

By

Published : Mar 17, 2019, 3:54 PM IST

వారసుడి కోసం కన్నయ్యకు కళ్లెం!
కన్నయ్య కుమార్​...! 2016 ఫిబ్రవరి వరకు ఈ పేరు దిల్లీ జవహర్​ లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం వరకే పరిమితం. దేశద్రోహం కేసులో అరెస్టుతో... కన్నయ్య పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. రాజకీయ దుమారం రేపింది.

మూడేళ్లు గడిచాయి. మోదీ వ్యతిరేక వాదనతో ముందుకుసాగారు కన్నయ్య. ఈ వాదనను... ఇప్పుడు పార్లమెంటు వేదికగా వినిపించాలన్నది ఆయన ఆలోచన. అందుకే... సార్వత్రిక సమరంలో పోటీకి సిద్ధమయ్యారు. బిహార్​లోని బెగూసరాయ్​ నియోజకవర్గం నుంచి సీపీఐ టికెట్​ ఆశిస్తున్నారు.

బెగూసరాయే ఎందుకు...?

దేశ రాజకీయాల్లో అరంగ్రేటం కోసం బెగూసరాయ్​ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి పెద్ద కారణమే ఉంది. బెగూసరాయ్​కు 'మినీ మాస్కో'గా పేరు. సీపీఐకి మంచి ఆదరణ ఉంది. ఇక్కడి నుంచైతే గెలుపు ఖాయమని కన్నయ్య విశ్వాసం.

బిహార్​లో ఆర్జేడీ, కాంగ్రెస్​ ప్రధాన పక్షాలుగా ఉన్న​ మహాకూటమిలో సీపీఐ భాగస్వామి. కన్నయ్యకు టికెట్​ ఇవ్వాలంటే.... బెగూసరాయ్​ స్థానాన్ని సీపీఐకి కేటాయించాలి. అనేక రోజులుగా విస్తృత చర్చలు జరుగుతున్నా... ఈ సీటు విషయం మాత్రం తేలడంలేదు.

''ఆర్జేడీతో చర్చలు జరుపుతున్నాం. పేరు ఖరారైతే కన్నయ్యకు తెలియపరుస్తాం. రాష్ట్ర, స్థానిక పార్టీ వర్గాలు కన్నయ్యను పోటీకి దించాలని నిర్ణయించాయి. ఆర్జేడీతో చర్చలు ఎలాంటి ఫలితం ఇస్తాయో చూడాలి''

- డి. రాజా, సీపీఐ నేత

ఇబ్బంది ఏంటి...?

బెగూసరాయ్​ టికెట్​ను కన్నయ్యకు కేటాయించడంలో ప్రధాన అడ్డంకి... ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్. కన్నయ్యకు, సీపీఐకి ఆ నియోజకవర్గంలో సరిపడా ప్రజాదరణ లేదన్నది లాలూ వాదన. బెగూసరాయ్​ నుంచి తన్వీర్​ హసన్​ను పోటీకి దించాలన్నది ఆర్జేడీ ఆలోచన.

కన్నయ్యకు టికెట్​ నిరాకరించడానికి... మరో కారణం చెబుతున్నారు లాలూ. అదే కులం. కన్నయ్య భూమిహర్​ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకు టికెట్​ ఇస్తే అగ్రవర్ణాల ఓట్లలో కోత పడుతుందన్నది ఆయన వాదన.

అసలు కారణం మరొకటి..?

సామాజిక సమీకరణాలు, విజయావకాశాలు అంటూ లాలూ లోతైన విశ్లేషణలు చేసినా... ఆయన మనసులో మరొక ఆలోచన ఉందన్నది రాజకీయ నిపుణుల మాట.

లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్​... ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్నారు. లోక్​జనశక్తి పార్టీ అధినేత, కేంద్రమంత్రి రామ్​ విలాస్​ పాసవాన్​ కుమారుడు చిరాక్​ పాసవాన్​దీ అదే పరిస్థితి. భవిష్యత్​ బిహార్​ రాజకీయాల్లో వీరిద్దరే కీలకం. ఇద్దరూ ప్రత్యర్థి కూటములకు చెందినవారు కాబట్టి... పోటీ సహజం.

ప్రస్తుతం... తేజస్వి, చిరాగ్​ మధ్యే పోటీ. కన్నయ్య రాకతో... ఆ పోటీ త్రిముఖం అవుతుంది. కన్నయ్యకు ఇప్పటికే జాతీయస్థాయి గుర్తింపు ఉంది. మంచి వాక్పటిమ ఆయన సొంతం. ఇప్పుడు బెగూసరాయ్​ నుంచి ఎన్నికై, పార్లమెంటుకు వెళ్తే... బిహార్​లో మరో రాజకీయ శక్తిగా కన్నయ్య ఎదిగే అవకాశముంది.

తేజస్వీ యాదవ్​కు కన్నయ్య పోటీగా మారకూడదన్న యోచనతోనే... బెగూసరాయ్​ టికెట్​ కేటాయించేందుకు లాలూ వెనకాడుతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

ABOUT THE AUTHOR

...view details