భాజపా, శివసేన మోసం చేశాయని కోర్టుకెక్కిన ఓటరు మహారాష్ట్రలో ఎన్నికల ముందు ఏర్పడిన పొత్తును గౌరవిస్తూ భాజపా, శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఠాణే జిల్లాకు చెందిన ప్రియా చౌహాన్ అనే ఓటరు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. భాజపా, శివసేనకు ప్రజలు పట్టం కట్టినా ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేసి, మోసం చేసినందుకు ఈ రెండు పార్టీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.
'ఎన్నికల ముందు పొత్తే ప్రామాణికం'
ఎన్నికల ముందు కూటమిగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలను ఈ రెండు పార్టీలు మోసం చేశాయని ఆమె ఆరోపించారు. ఎన్నికల ముందు నాటి కూటమి మేరకే ఇరు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు వారిని ఆదేశించాల్సిందిగా కోరారు.
ఫలితాల అనంతరం ఏర్పాటైన కూటములు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కేంద్ర , రాష్ట్ర యంత్రాంగాలను ఆదేశించాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ అంశంపై త్వరలోనే హైకోర్టు విచారణ చేపట్టనుంది.
ఇదీ చూడండి: పార్టీ ఉపాధ్యక్షుడిపై దాడి- ఎగిరెళ్లి పొదల్లో పడ్డ నేత