తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా వికాస్​ అఘాడీ'కి లైన్​ క్లియర్​.. 28న ఠాక్రే ప్రమాణం - మహా వికాస్​ అఘాడీ

మంగళవారం జరిగిన రాజకీయ పరిణామాలతో.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన వీడింది. కాంగ్రెస్​-ఎన్సీపీ-శివసేన కూటమిగా ఉన్న 'మహా వికాస్​ అఘాడీ' ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే.. ఈ నెల 28న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

maha-vikas-aghadi
'మహా వికాస్​ అఘాడీ'కి లైన్​ క్లియర్​.. 28న ఠాక్రే ప్రమాణం

By

Published : Nov 27, 2019, 5:35 AM IST

Updated : Nov 27, 2019, 6:45 AM IST

'మహా వికాస్​ అఘాడీ'కి లైన్​ క్లియర్​.. 28న ఠాక్రే ప్రమాణం

మహారాష్ట్రలో కాంగ్రెస్​-ఎన్సీపీ-శివసేన నేతృత్వంలోని 'మహా వికాస్​ అఘాడీ' ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే.. ఈ నెల 28న ప్రమాణం చేయనున్నారు. శివాజీ పార్క్​ మైదానం ఈ ఘట్టానికి వేదిక కానుంది. గవర్నర్​ భగత్​ సింగ్​​ కోశ్యారీ కోరిక మేరకు ముందుగా అనుకున్న తేదీలో స్వల్ప మార్పు చేశారు.

అంతకుముందు ముంబయిలోని ట్రైడెంట్​ హోటల్​లో భేటీ అయిన మహావికాస్ అఘాడీ నేతలు.. తమ నాయకుడిగా ఉద్ధవ్​ ఠాక్రేను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎం ప్రమాణస్వీకారోత్సవాన్ని డిసెంబరు​ 1న చేయాలని మొదటగా నిర్ణయించారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్​ కోశ్యారీని కలిశారు ఠాక్రే. కూటమి నేతలతో కలిసి వెళ్లిన ఆయన గవర్నర్​తో రెండు గంటలపాటు చర్చించారు. అయితే ఈ నెల 28నే ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ఠాక్రేను గవర్నర్​ కోరారు. ఫలితంగా ప్రమాణ తేదీని మార్చారు శివసేన అధ్యక్షుడు.

ప్రతి ప్రశ్నకూ సమాధానమిస్తా...

ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటంపై ఉద్ధవ్​ ఠాక్రే సంతోషం వ్యక్తం చేశారు. ఫడణవీస్ చేసిన ప్రతి ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఛత్రపతి శివాజీ కోరుకున్న మహారాష్ట్రను పునర్నిర్మిద్దామని పిలుపునిచ్చారు ఠాక్రే. తనకు సహకరించిన కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​కు కృతజ్ఞతలు తెలిపారు.

6 నెలల్లో ఎన్నికవ్వాలి...

ఉద్ధవ్​ ఠాక్రే.. ప్రస్తుతం మహారాష్ట్ర శాసనసభలో సభ్యుడు కానందున, సీఎంగా ఎన్నికైన 6 నెలల్లోపు శాసన సభ్యత్వం పొందాల్సి ఉంటుంది.

సుప్రీం తీర్పుతో మారిన లెక్కలు...

ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్..​ భాజపాను ఆహ్వానించడాన్ని సవాల్​ చేస్తూ కాంగ్రెస్​-ఎన్సీపీ-శివసేన సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్​ను ఆదేశించింది. తక్షణమే.. ప్రొటెం స్పీకర్​ను నియమించి, ఈ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది.

అనంతరం.. మహా రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్​ రాజీనామా చేయడం.. అనంతరం సీఎంగా దేవేంద్ర ఫడణవీస్​ వైదొలగడం, అధికారం కోల్పోవడం చకచకా జరిగిపోయాయి. కాంగ్రెస్​-ఎన్సీపీ-శివసేన నేతృత్వంలోని 'మహా వికాస్​ అఘాడీ' నేతలు గవర్నర్​తో సమావేశమయ్యారు. తమకు 166 మంది ఎమ్మెల్యేల మద్దతుందని.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్​ను కోరారు. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి.. శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రేను ఈ నెల 28న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరారు కోశ్యారీ. డిసెంబర్​ 3వ తేదీలోగా మద్దతుదారుల జాబితాను సమర్పించాలంటూ ఠాక్రేకు.. గవర్నర్​ లేఖ రాశారు.

Last Updated : Nov 27, 2019, 6:45 AM IST

ABOUT THE AUTHOR

...view details