కీలక సమావేశాలతో మహారాష్ట్ర రాజకీయాలు నేడు మరింత ఉత్కంఠగా మారనున్నాయి. ఈ సమావేశాల తర్వాత మహా ప్రతిష్టంభనకు తెరదించితూ.. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన పార్టీలు కీలక ప్రకటన చేసే అవకాశముంది.
మూడు భేటీలు...
నేడు ముంబయిలో మిత్రపక్షాలతో భేటీకానున్నారు కాంగ్రెస్-ఎన్సీపీ నేతలు. అనంతరం శివసేనతో సమావేశమవుతారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ ప్రకటించారు. శివసేనతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఉన్న అన్ని అంశాలపైనా కాంగ్రెస్-ఎన్సీపీ నేతలు ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. కనీస ఉమ్మడి ప్రణాళిక, కూటమి ఏర్పాటు, అధికార భాగస్వామ్యం తదితర విషయాలను శివసేనతో చర్చించనున్నట్టు స్పష్టం చేశారు.
ఎన్సీపీ-కాంగ్రెస్తో భేటీకీ ముందు.. శివసేన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సమావేశం కానున్నారు. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. సేన భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రసంగం చేయనున్నారు ఠాక్రే.