మహారాష్ట్రలో అధికారం నిలబెట్టుకునే దిశగా భాజపా-శివసేనకూటమి సాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145కు మించి ఆధిక్యంలో ఉంది. 2014 ఫలితాలతో పోలిస్తే భాజపాకు స్థానాలు తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శివసేనకు మాత్రం స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.
భాజపా ఆధిక్యానికి తిరుగుబాటు అభ్యర్థులే గండికొట్టినట్లు కనిపిస్తోంది. భాజపా-శివసేన కూటమే లక్ష్యంగా 61 మంది రెబల్స్ బరిలో నిలిచారు. అధికార కూటమి దూకుడుకు వీరే కళ్లెం వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
భాజపాపైనే అధికం...
టికెట్లు దక్కని ఆశావహులు... రెబల్స్‌గా బరిలోకి దిగడం సహజమే. మహారాష్ట్రలోనూ అదే జరిగింది. ఒకరిద్దరే కదా అనుకుంటే పెద్ద ఇబ్బంది కాదు. కానీ మొత్తం 288 నియోజకవర్గాలకుగాను దాదాపు 75 చోట్ల రెబల్స్ తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ప్రధాన పార్టీలకు ఏ మాత్రం తీసిపోకుండా వీరి ప్రచారం సాగింది.
రెబల్స్‌లో అత్యధికులు భాజపా-శివసేన లక్ష్యంగా బరిలోకి దిగినవారే. భాజపాకు చెందిన 38 మంది తిరుగుబాటు అభ్యర్థులుగా నిలిచారు. శివసేన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన 23 మంది పోటీ చేశారు.
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 9 మంది, ఎన్సీపీపై నలుగురు రెబల్స్‌గా పోటీ చేశారు.
ఎన్నికల ముందు...
ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి చాలా మంది నాయకులు భాజపా, శివసేనలో చేరారు. అయితే రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం వల్ల టికెట్లు దక్కని ఆశావహులు రెబల్స్‌గా బరిలో నిలిచారు. కాంగ్రెస్, ఎన్సీపీకి రెబల్స్ సంఖ్య ఎక్కువగా లేకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో ఎదురీదక తప్పలేదు.
ప్రాంతాల వారీగా...
- ముంబయి (6)... శివసేనకు 3, భాజపాకు ఇద్దరు రెబల్స్ ఉన్నారు.
- కొంకణ్ (7)...కాంగ్రెస్‌కు 4, భాజపాకు 2, శివసేనకు వ్యతిరేకంగా ఒక రెబల్ పోటీ చేశారు.
- మరాఠ్వాడా (14)... భాజపాకు 6, శివసేనకు 5, ఎన్సీపీకి 2, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఒక రెబల్ సవాల్ విసిరారు.
- పశ్చిమ మహారాష్ట్ర (13)... భాజపా (6), శివసేన (5), ఎన్సీపీ 1, కాంగ్రెస్‌కు ఒక రెబల్ బరిలో ఉన్నారు.
- అమరావతి (5)... భాజపా (3), శివసేన (1), కాంగ్రెస్‌కు ఒక రెబల్ ఉన్నారు.
- నాగ్‌పుర్ (18)...భాజపా (9), శివసేన (7), కాంగ్రెస్‌కు ఇద్దరు తిరుగుబాటుదారులు ఉన్నారు.
- ఉత్తర మహారాష్ట్ర (12)... ఇక్కడ భాజపా (10), శివసేన (1), ఎన్సీపీకి ఒక రెబల్ ఉన్నారు.