అక్టోబర్లో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల కోసం కసరత్తును ముమ్మరం చేసింది భాజపా. ప్రాంతాల వారీగా తమకున్న బలాలు, బలహీనతలను అంచనా వేయడానికి పార్టీ కోర్ కమిటీ మంగళవారం సమావేశమైంది. శివసేనతో సీట్ల పంపకాల ఒప్పందం ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్తో జరిగిన సాధారణ సమావేశమేనని పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
"2014 ఎన్నికల అనంతరం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భాజపా మరింత బలపడింది. ఈ నేపథ్యంలో పార్టీ శక్తిసామర్థ్యాలను అంచనా వేయడం ఎన్నికల ప్రచారాలకు ఎంతో అవసరం. కొన్ని చోట్ల భాజపా మరింత దృష్టి సారించాల్సి ఉంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది."
-భాజపా సీనియర్ నేత
అమిత్ షాతో చర్చించాకే తుది నిర్ణయం...
సీట్ల పంపకాలపై ముఖ్యమంత్రి ఫడణవీస్.. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటన చేస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తెలిపారు. ఈ విషయంపైనే వారు భాజపా అధ్యక్షుడు అమిత్ షాతో చర్చలు జరుపుతున్నారని స్పష్టం చేశారు.
భాజపా బలం పుంజుకున్న కారణంగా ఒక నియోజకవర్గంలో ఒకరి కంటే ఎక్కువమంది ఆశావహులు టికెట్లు ఆశిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపులపై సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు.
2014 శాసనసభ ఎన్నికల్లో 122 స్థానాలు గెలుచుకుంది కమలం పార్టీ. మొత్తం 288 సీట్లు ఉండగా నాటి ఎన్నికల్లో 260 స్థానాలకు పోటీ చేసింది భాజపా. స్థానిక సంస్థల్లోనూ గెలిచి సంస్థాగతంగా పటిష్ఠంగా ఉంది.
2019 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఉన్న మొత్తం 48 సీట్లలో 23 నియోజకవర్గాల్లో భాజపా విజయం సాధించింది. శివసేన 18 సీట్లలో జెండా ఎగరేసింది.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్కు 'ఐబీసీ ఇన్నోవేషన్' పురస్కారం