ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్పైనే మహారాష్ట్ర రాజకీయాల దిశ ఆధారపడి ఉంటుందని శివసేన తెలిపింది. రాష్ట్ర ప్రజల అభీష్టం, దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ ఏర్పాటు త్వరగా జరగాలని తమ పార్టీ పత్రిక సామ్నాలో ఓ సంపాదకీయాన్ని ప్రచురించింది సేన.
"దిల్లీకి వెళ్లి తిరిగివచ్చిన వెంటనే.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన నిర్ణయాలపైనే మహారాష్ట్ర రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి."
-శివసేన ప్రకటన.
సోమవారం దిల్లీకి వెళ్లిన ఫడణవీస్.. కేంద్ర హోంమంత్రి, భాజపా అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఫడణవీస్ వ్యాఖ్యానించారు. భాజపాకు సీట్లు తక్కువ రావడంపై అమిత్‌షాకు ఫడణవీస్ వివరించారని తెలుస్తోంది.
ఐదేళ్ల పదవీకాలాన్ని పంచుకోవడంపై రెండు పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తమ సామ్నా పత్రికలో సంపాదకీయాల ద్వారా భాజపాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది శివసేన. తాజా రాజకీయ సంక్షోభానికి కారణం భాజపా, ముఖ్యమంత్రి ఫడణవీస్ అని ఆరోపిస్తోంది.
"ప్రభుత్వ ఏర్పాటు అంశం దారుణంగా తయారైంది. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని రాజ్యాంగ వ్యతిరేకంగా అధికారాన్ని అట్టిపెట్టుకునేందుకు రాజకీయ క్రీనీడలు జరుగుతున్నాయి. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో సమావేశం అనంతరం రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ఫడణవిస్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, షా ఒకవైపు.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, శరద్‌పవార్ మరోవైపు ఉండి అవసరమైన మెజారిటీని ఏర్పరిచేందుకు కృషి చేస్తున్నారు."
-సామ్నా పత్రిక సంపాదకీయంలోని ఓ వాక్యం
కాంగ్రెస్, ఎన్సీపీ కలిసినా అవసరమైన మెజారిటీ సాధ్యం అయ్యే పరిస్థితులు కన్పించడం లేదని అభిప్రాయపడింది సేన. మెజారిటీ సాధించడం పొగమంచుతో కూడిన దిల్లీలో విమానాన్ని దించడమంత కష్టమని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.