కరోనా దెబ్బకు వలస కూలీల బతుకులు ఛిద్రమైపోతున్నాయి. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఉన్నచోట తినడానికి తిండి దొరక్క, ఆదరించే దిక్కులేక కాలినడకన సొంతూళ్ల బాటపడుతూ మధ్యలోనే తనువు చాలిస్తున్న వలస కూలీలెందరో..! కనీసం తమ కుటుంబ సభ్యులతోనైనా కలిసి ఉండొచ్చనే ఆశతో ఇంటికి బయల్దేరిన వారి బతుకులు మధ్యలోనే ముగిసిపోతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో వలస కూలీలు ప్రాణాలు కోల్పోగా.. మహారాష్ట్రలో మరో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.
పింటూ పవార్ (40) అనే వ్యవసాయ కూలీ మహారాష్ట్రలోని పుణె నుంచి పర్బానీ జిల్లాలోని తన స్వగ్రామానికి బయల్దేరాడు. లాక్‌డౌన్‌తో వాహనాలు తిరగకపోవడం వల్ల ఎలాగైనా తన సొంతూరుకు చేరుకోవాలనే ఆశతో మండే ఎండల్లో కాలి నడకన బయల్దేరాడు. ఈ క్రమంలో అతడు ఆకలితో, డీహైడ్రేషన్‌తో ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు. పుణె నుంచి తన స్వగ్రామానికి బయల్దేరిన పింటూ పవార్.. బీద్ జిల్లాలోని ధనోరా గ్రామంలో (స్వగ్రామానికి 200 కి.మీల దూరంలో) సోమవారం ప్రాణాలు కోల్పోయినట్టు అంభోరా పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ధ్యానేశ్వర్ కుక్లరే తెలిపారు.