దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. అత్యధిక కేసులు నమోదయిన నేపథ్యంలో వైరస్ కేసుల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో గుజరాత్, దిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు నిలిచాయి.
మహారాష్ట్రలో 10 వేలు దాటిన కరోనా కేసులు
మహారాష్ట్రలో రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 583 మందికి వైరస్ సోకింది. రాష్ట్రంలో 10,498 మందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా మరో 27 మంది మరణించగా.. మొత్తంగా మృతుల సంఖ్య 459కి చేరింది.
గుజరాత్లో 4 వేలకు పైగా
గుజరాత్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇవాళ మరో 313 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 4,395కు చేరినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 214 మంది వైరస్‌కు బలయ్యారు. 613 మంది ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారని సమాచారం.
తమిళనాడులో రికార్డు స్థాయిలో 161 కేసులు
తమిళనాడులో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 161 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో వైరస్ బాధితుల సంఖ్య 2,323కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 1,258 మంది కోలుకున్నట్లు చెప్పారు. మొత్తంగా 27 మంది మహమ్మారికి బలయ్యారు.
పంజాబ్‌లో 100కు పైగా కేసులు
పంజాబ్‌లో నేడు మరో 105 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 480 మంది ప్రాణాంతక వైరస్ బారిన పడినట్లు రాష్ట్ర అధికారులు ప్రకటించారు. కొత్తగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 104 మందికి వైరస్ నయమైంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో 40 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో నేడు మరో 77 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,211 మందికి వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. మొత్తం 482 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. మరో 40 మంది మృతి చెందారు.