మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ సిఫార్సు చేయడంపై న్యాయ నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. కొందరు గవర్నర్ సిఫార్సును 'రాజ్యాంగ విరుద్ధ చర్య' ఏమీ కాదని అభిప్రాయపడుతుండగా, మరికొందరు ఈ వాదనను వ్యతిరేకిస్తున్నారు.
'రాజ్యాంగ విరుద్ధం'
గవర్నర్... రాష్ట్రపతిపాలనకు సిఫార్సు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రముఖ న్యాయనిపుణులు ఉల్హాస్ బాపట్ అభిప్రాయపడ్డారు.
"మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి.. భాజపాకు రెండు రోజుల సమయం ఇచ్చారు. కానీ మిగతా రెండు పార్టీలకు కేవలం 24 గంటల సమయం మాత్రమే ఇచ్చారు. ఇది పూర్తిగా పక్షపాతంతో కూడిన చర్య."
- ఉల్హాస్ బాపట్, ప్రముఖ న్యాయనిపుణులు
ఔషధమేమీ కాదు..
రాష్ట్రపతి పాలనను గవర్నర్ కోశ్యారీ 'ఔషధం'గా పేర్కొన్నారని, అయితే అన్ని దారులు మూసుకుపోయిన అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీనిని ఉపయోగించాలని ఉల్హాస్ బాపట్ అభిప్రాయపడ్డారు. నిజానికి గవర్నర్ కాంగ్రెస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు. దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి అవకాశం ఉంది అని బాపట్ పేర్కొన్నారు.
'గవర్నర్ చర్య న్యాయబద్ధమే'
'ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. గవర్నర్ ప్రతి ఒక్కరితో సంప్రదించారు. అయితే వాస్తవానికి కాంగ్రెస్‌ను మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు. కానీ అన్ని అవకాశాలను పరిశీలించిన తరువాత గవర్నర్ న్యాయబద్ధంగా వ్యవహరించారని అనుకుంటున్నాను.' అని ప్రముఖ రాజ్యాంగ నిపుణులు రాకేశ్ ద్వివేది అభిప్రాయపడ్డారు.
"గవర్నర్... రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదని నేను భావిస్తున్నాను."
- రాకేశ్ ద్వివేది, సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు
ఎన్నికల ఫలితాలు వెలువడి 18 రోజులు గడిచిపోయాయని.. పార్టీలు ఎవరితో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేయాలో నిర్ణయించుకునేందుకు ఇది చాలా ఎక్కువ సమయమే అని రాకేశ్ ద్వివేది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే పార్టీలు ఇప్పటికీ గవర్నర్‌ను సంప్రదించే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. రాష్ట్రపతి పాలన విధింపు... సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అడ్డంకి కాదని స్పష్టం చేశారు ద్వివేది.
న్యాయబద్ధంగా వ్యవహరించారు..
భాజపా, శివసేన, ఎన్సీపీలు బలనిరూపణ చేసుకోలేకపోయాయని, ఈ పరిస్థితుల్లో గవర్నర్ తన విచక్షణ వినియోగించవచ్చని సీనియర్ న్యాయవాది అజిత్ కుమార్ సిన్హా పేర్కొన్నారు.
"గవర్నర్ న్యాయబద్ధంగా వ్యవహరించారు. మెజారిటీ నిరూపించుకోవడానికి ఏ పార్టీ ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ తన విచక్షణను ఉపయోగించుకోవచ్చు. రాష్ట్రపతి పాలనను సిఫారసు చేయవచ్చు."
- అజిత్ కుమార్ సిన్హా, సీనియర్ న్యాయవాది
"పార్టీలేవీ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితులు లేనపుడు.. సహేతుక కారణాలతో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయవచ్చు."
- శ్రీహరి అనీ, మహారాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్
సంఖ్యాబలం లేక భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి ముందుకురాలేదు. శివసేన ఇచ్చిన గడువులోగా బలనిరూపణ చేసుకోలేకపోయింది. ఫలితంగా మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యంకాదని పేర్కొంటూ గవర్నర్.. రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి ఓ నివేదిక పంపారు. ఫలితంగా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు.
ఇదీ చూడండి: రాష్ట్రపతి పాలనలో మహారాష్ట్ర - కొనసాగనున్న పార్టీల చర్చలు!