తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహారాష్ట్ర' వ్యవహారంపై తీర్పు రేపటికి వాయిదా

'మహారాష్ట్ర' వ్యవహారంపై కాసేపట్లో సుప్రీం నిర్ణయం

By

Published : Nov 25, 2019, 9:44 AM IST

Updated : Nov 25, 2019, 12:13 PM IST

12:12 November 25

మహారాష్ట్ర వ్యవహారంపై రేపు సుప్రీంకోర్టు తీర్పు

మహారాష్ట్ర వ్యవహారంపై రేపు ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. రెండో రోజు దాదాపు గంటన్నరసేపు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. జస్టిస్‌ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు ఆలకించింది. 

మహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవీస్​ను​ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానిస్తూ గవర్నర్​ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ కాంగ్రెస్​- శివసేన-ఎన్​సీపీ-కాంగ్రెస్ సంయుక్త​ పిటిషన్​ దాఖలు చేశాయి. 24 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించేలా ఆదేశించాలని కూటమి తరఫు న్యాయవాదులు కోరారు. అయితే ఈ వాదనను భాజపా తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. వాదనలు ఆలకించిన సుప్రీం రేపు ఉదయం 10.30కు తీర్పును వాయిదా వేసింది.
 

11:54 November 25

తీర్పు రేపటికి వాయిదా...

మహారాష్ట్ర వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనుంది సుప్రీం కోర్టు.

11:50 November 25

12 మంది సంతకాలు లేవు...

అజిత్‌ పవార్‌ను తొలగించినట్టు గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో 12 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేవని సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. 

11:44 November 25

24 గంటల్లో బలపరీక్ష పెట్టండి...

రెండు పక్షాలు బలపరీక్షకు సిద్ధంగా ఉన్నప్పుడు అఫిడవిట్లు, సమాధానాలు ఎందుకని అభిషేక్‌ సింఘ్వీ ప్రశ్నించారు. రేపు బలపరీక్ష నిర్వహించాలని కోరారు. ప్రజాస్వామ్య పవిత్రతను కాపాడేందుకు గతంలో సుప్రీంకోర్టు 24 గంటల్లోనే బలపరీక్ష నిర్వహించాలని చెప్పిందని ప్రస్తావించారు.

11:37 November 25

సింఘ్వీ వాదనలు...

ఎన్సీపీ తరఫున వాదనలు వినిపిస్తున్నారు అభిషేక్‌ మను సింఘ్వీ. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని సింఘ్వీ కోర్టుకు తెలిపారు. బలపరీక్షకు రెండు పక్షాలు సిద్ధంగా ఉన్నాయని.. అదెప్పుడన్నదే ఇప్పుడు ప్రశ్న అన్నారు. 54 మంది ఎమ్మెల్యేల సంతకం ఉందని వారు అన్నారే... కానీ వారు భాజపాకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారా అని సింఘ్వీ ప్రశ్నించారు. ఆ లేఖలో 54 మంది ఎమ్మెల్యేలు భాజపాకు మద్దతు ఇస్తున్నట్టు ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. వారు సమర్పించిన లేఖ అజిత్‌ పవార్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నదని.. మద్దతు లేఖ కాదన్నారు.  అది 54 మంది ఎమ్మెల్యేల సంతకాల జాబితా మాత్రమేనని  సింఘ్వీ కోర్టుకు వివరించారు.

11:35 November 25

రోహత్గీ వాదనలు...

ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులకు అవకాశం లేదని ముకుల్‌ రోహత్గీ వాదించారు. గవర్నర్‌ను కోర్టు ఆదేశించజాలదని తెలిపారు.

11:24 November 25

కపిల్​ సిబల్​ వాదన...

కాంగ్రెస్‌-ఎన్సీపీ-శివసేన తరఫున కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. శుక్రవారం రాత్రి 7 నుంచి శనివారం ఉదయం 5 గంటల్లోపు అంతా అయిపోయిందని కపిల్​ తెలిపారు. మూడు పార్టీల ప్రభుత్వం ఏర్పడకుండా భాజపా ఇలా వ్యవహరించిందని ఆరోపించారు. భాజపా-శివసేన మధ్య పొత్తు బెడిసిందని... దానికి కాంగ్రెస్‌, ఎన్సీపీకి సంబంధం లేదని కపిల్ సిబల్‌ అన్నారు. రాష్ట్రపతి పాలన ఎత్తివేయడం వెనుక దురుద్దేశం ఉందని ఆరోపించారు. తెల్లవారుజామున 5.17 గం.కు రాష్ట్రపతి పాలన ఎత్తేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. అంత అత్యవసర నిర్ణయాలకు ఎలాంటి కారణాలు చూపలేదని వ్యాఖ్యనించారు.

తనకు 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్‌ పవార్‌ అంటున్నారని... కానీ ఆయన్ను శాసనసభాపక్ష నేత పదవి నుంచి పార్టీ తొలగించిందని కపిల్‌ సిబల్‌ ప్రస్తావించారు. తక్షణమే బలపరీక్ష నిర్వహించాలని, సీనియర్‌ సభ్యుడు ప్రొటెం స్పీకర్‌గా ఉంటారని కపిల్‌ సిబల్‌ కోర్టుకు విన్నవించారు. ఎన్సీపీ తరఫున అజిత్‌ పవార్‌ ప్రాతినిధ్యం వహించట్లేదని తెలిపే అఫిడవిట్లు కోర్టుకు సమర్పిస్తున్నట్లు తెలిపారు సిబల్.

11:18 November 25

రాజ్యసభ వాయిదా...

మహారాష్ట్ర వ్యవహారంపై విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం వల్ల రాజ్యసభను ఛైర్మన్​ వెంకయ్యనాయుడు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

11:15 November 25

అజిత్​ పవార్​ తరఫున వాదన...

అజిత్‌ పవార్‌ తరఫున న్యాయవాది మనీందర్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. తమ జాబితా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వాస్తవికంగా సరైనదని కోర్టుకు తెలిపారు.

11:08 November 25

లోక్​సభలో దుమారం...

మహారాష్ట్ర వ్యవహారంపై లోక్​సభలో దుమారం చెలరేగింది. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ నేడు లోక్​సభకు వచ్చారు. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని రాహుల్​ సభలో అన్నారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం ఆపాలంటూ విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభాపతి ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

11:01 November 25

భాజపా తరఫున రోహత్గీ వాదనలు...

దేవేంద్ర ఫడణవీస్‌ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. ఎన్నికలకు ముందున్న మిత్రపక్షం శివసేన వెళ్లడం వల్లే రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత భాజపాకు అజిత్‌ పవార్‌ నుంచి మద్దతు లభించిందని కోర్టుకు స్పష్టం చేశారు. ఒక పవార్‌ భాజపా వైపు ఉన్నారని, మరో పవార్‌ అటు వైపు ఉన్నారని రోహత్గీ వెల్లడించారు. కుటుంబంలో కలహాలు ఉండవచ్చు దాంతో తమకు సంబంధం లేదని వాదించారు. బేరసారాలకు పాల్పడుతోంది వాళ్లేనని, తాము కాదని రోహత్గీ కోర్టుకు తెలిపారు.

10:54 November 25

170 మంది ఎమ్మెల్యేల మద్దతు...

లోతైన విచారణ జరపాల్సిన అవసరం గవర్నర్‌కు లేదని సొలిసిటర్‌ జనరల్‌ వాదించారు. ముందున్న వాస్తవాల ఆధారంగా మెజార్టీని బట్టి గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఫడణవీస్‌-పవార్‌ ప్రభుత్వానికి 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. గవర్నర్‌ లేఖను మెహతా చదివి వినిపించారు. 

10:50 November 25

ఎమ్మెల్యేల మద్దతు ఉంది...

ఎమ్మెల్యేలంతా అజిత్​ పవార్​ను ఎన్సీపీ నేతగా ఎన్నుకున్నారని లేఖలో ఉందని సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు వెల్లడించారు. ఎన్సీపీ 54 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని అజిత్ పవార్ లేఖలో చెప్పారన్నారు.

10:47 November 25

తుషార్​ వాదన...

గవర్నర్‌ కార్యదర్శి తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్​ మెహతా వాదనలు వినిపించారు. గవర్నర్‌ నిర్ణయంపై న్యాయసమీక్ష పరిధిని సొలిసిటర్‌ జనరల్‌ ప్రశ్నించారు. 

గవర్నర్‌ ఆహ్వాన లేఖను ధర్మాసనానికి అందజేశారు. 

10:43 November 25

లేఖల సమర్పణ...

కోర్టు అడిగిన లేఖలు తెచ్చానని సొలిసిటర్‌ జనరల్ ధర్మాసనానికి తెలిపారు. గవర్నర్‌ నిర్ణయాన్ని తెలిపేముందు అసలేం జరిగిందో కోర్టుకు వివరిస్తానని సొలిసిటర్‌ జనరల్‌ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ 3 పార్టీలను ఆహ్వానించారని... అన్ని పార్టీలు విఫలమైన తర్వాతే రాష్ట్రపతి పాలన విధించారని తుషార్​ మెహతా కోర్టుకు విన్నవించారు. 

10:36 November 25

విచారణ షురూ...

మహారాష్ట్ర అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. సుప్రీం కోర్టు అడిగిన రెండు లేఖలు సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా ధర్మాసనానికి సమర్పించనున్నారు.

10:35 November 25

'ఆపరేషన్​ కమల్'...

మహారాష్ట్రలో భాజపా నేతలు 'ఆపరేషన్​ కమల్'​ను నిర్వహిస్తున్నారని శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ ఆరోపించారు. ఈ ఆపరేషన్​లో సీబీఐ, ఈడీ, అనిశా, పోలీసులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇవేమీ భాజపాకు ఫలితం ఇవ్వలేవని అభిప్రాయపడ్డారు.

10:32 November 25

రాజ్​భవన్​కు 3 పార్టీల నేతలు...

గవర్నర్​ను కలిసేందుకు శివసేన-కాంగ్రెస్​- ఎన్​సీపీ ముఖ్యనేతలు రాజ్​భవన్​కు​ చేరుకున్నారు. 

10:24 November 25

లేఖలు సమర్పిస్తారు...

ఫడణవీస్​ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్​ రాసిన లేఖ.. అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేల మద్దతుతో గవర్నర్​కు... ఫడణవీస్​ పంపిన లేఖలను కోర్టుకు సమర్పించనున్నట్లు భాజపా తరఫున వాదనలు వినిపిస్తోన్న సీనియర్​ న్యాయవాది రోహత్గి తెలిపారు.

గవర్నర్​కు ఫడణవీస్​ ఇచ్చిన లేఖతో పాటు ఎన్​సీపీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ సంతకాలు చేసిన పత్రం వాటితో ఉన్నట్లు రోహత్గీ స్పష్టం చేశారు.  

10:14 November 25

'రాజీనామా చేస్తే మంచిది'

ఎమ్మెల్యేల బలం లేకపోయినా దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా కొనసాగడం సరికాదని ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్​ అన్నారు. ఎన్​సీపీకి చెందిన 53 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నట్లు తెలిపారు. 3 పార్టీల కూటమికి మొత్తం 165 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు. బలపరీక్షలో భాజపా ఓటమి పాలవ్వక ముందే ఫడణవీస్​, అజిత్​ పవార్​ రాజీనామా చేయడం మంచిదని హితవు పలికారు.  

10:12 November 25

గవర్నర్​ వద్దకు 3 పార్టీలు...

శివసేన-ఎన్​సీపీ-కాంగ్రెస్​ మూడు పార్టీల నాయకులు నేడు మహారాష్ట్ర గవర్నర్​ను కలవనున్నారు. ఈ మేరకు శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ ప్రకటించారు. 

10:00 November 25

కాంగ్రెస్​ కీలక భేటీ...

మహారాష్ట్రలో రాజకీయాలు క్షణక్షణానికి మారుతోన్న వేళ... కాంగ్రెస్​ పార్లమెంటరీ వ్యూహాత్మక బృందం భేటీ అయింది. అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సీనియర్​ నేతలు గులాం నబీ ఆజాద్, అధిర్​ రంజన్​ చౌదరీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్​ ప్రమాణస్వీకారం చేయడం సహా భాజపా రాజకీయంపై పార్లమెంటులో నిలదీయాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. 

09:13 November 25

'మహారాష్ట్ర' వ్యవహారంపై కాసేపట్లో సుప్రీం నిర్ణయం

మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య దేవేంద్ర ఫడణవీస్‌ సర్కార్‌ ఏర్పాటుకు అనుమతిస్తూ గవర్నర్‌ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు కాసేపట్లో స్పష్టత ఇవ్వనుంది. ఆయన నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు అత్యున్నత న్యాయస్థానాన్ని శనివారం ఆశ్రయించగా....ఆదివారం ప్రత్యేక విచారణ చేపట్టింది సర్వోన్నత న్యాయస్థానం.

దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్‌ ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నారో చెప్పే లేఖలను సోమవారం ఉదయం 10.30 గంటలకల్లా సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిని పరిశీలించాకే తదుపరి ఉత్తర్వులు జారీచేస్తామని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం నిన్న స్పష్టం చేసింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసింది.   ఫడణవీస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్న వాదన సహా పిటిషనర్లు లేవనెత్తిన అన్ని అంశాలనూ పరిశీలనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది.

ముచ్చటగా మూడోసారి..

ఈ ఏడాది పలు కీలక సందర్భాల్లో సెలవురోజుల్లో ప్రత్యేక ప్రొసీడింగ్​లను నిర్వహించింది సుప్రీంకోర్టు.

  • మహారాష్ట్రలో ఫడణవీస్​ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ శివసేన-ఎన్సీపీ దాఖలు చేసిన పిటిషన్​పై సెలవురోజైన ఆదివారం విచారణ చేపట్టింది.
  • అయోధ్య కేసు విషయంలో ప్రత్యేకంగా సమావేశమై తీర్పు వెలువరించిన నవంబరు 9వ తేదీ(శనివారం) సెలవు రోజే.
  • ఏప్రిల్ 20న (శనివారం) అప్పటి ఛీఫ్​ జస్టిస్​ రంజన్​ గొగొయిపై దాఖలైన లైంగిక వేధింపుల కేసును విచారించింది సర్వోన్నత న్యాయస్థానం
Last Updated : Nov 25, 2019, 12:13 PM IST

ABOUT THE AUTHOR

...view details