నిన్నటివరకు హోటళ్లు, పార్టీ కార్యాలయాలు కేంద్రంగా జరిగిన మహారాష్ట్ర రాజకీయం నేడు శాసనసభకు చేరుకుంది. కొత్తగా ఎన్నికైన వారితో శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కొలంబ్కర్. తొలుత... ఎమ్మెల్యేలు బాబన్‌రావ్ పచ్పుటే, విజయ్‌కుమార్ గవిట్, రాధాకృష్ణ విఖే పాటిల్‌ను ప్రిసైడింగ్ అధికారులుగా ప్రకటించారు ప్రొటెం స్పీకర్.
అనంతరం దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్, దిలీప్ వాల్సే పాటిల్, ఛగన్ భుజ్‌బల్, కాంగ్రెస్ నేతలు అశోక్ చవాన్, పృథ్వీరాజ్, భాజపా నేత హరిభావ్ భగాడే ప్రమాణ చేశారు.
'అన్నచెల్లెలి అనుబంధం'
మహారాష్ట్ర శాసససభ ప్రత్యేక సమావేశం సందర్భంగా ఎన్నికైన శాసనసభ్యులను ఆహ్వానిస్తూ ప్రవేశద్వారం వద్ద నిల్చున్నారు ఎన్సీపీ నేత, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె. ఇంతలో శాసనసభలోకి వెళ్లేందుకు అక్కడికి చేరుకున్నారు అజిత్ పవార్. తిరుబాటు యత్నం విఫలమై పవార్‌తో రాజీ పడిన సోదరుడు అజిత్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు సుప్రియ.
అనంతరం అక్కడికి వచ్చిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తోనూ కరచాలనం చేశారు సూలె. కాసేపు ఆయనతో ముచ్చటించారు.
'పార్టీతోనే నా ప్రయాణం'
తన రాజకీయ ప్రస్థానం ఎన్సీపీతోనే అని స్పష్టం చేశారు అజిత్ పవార్.
"ప్రస్తుతం నేను చెప్పేదేమీ లేదు. సరైన సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. నేను ఇంతకుముందే చెప్పాను. నేను ఎన్సీపీలోనే ఉన్నాను. ఉంటాను కూడా. ఇందులో గందరగోళం సృష్టించేందుకు ఏమీ లేదు."